చండూరు, అక్టోబర్ 25 : చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చేనేత రుణమాఫీ ప్రకటించి పది నెలలు అవుతున్నా నేటికి అతిగతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున అందించాల్సిన చేనేత భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని. ఇందుకు కావాల్సిన పత్రాలను కార్మికులు సమర్పించారని, కానీ నేటికీ నెలలు గడుస్తున్నా పథకం కాగితాలకే పరిమితమైందన్నారు.
నెల వారీగా త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద జమ చేస్తున్న మొత్తానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేనేత రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిర్లక్ష్యం వీడకుంటే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ ప్రసన్నలక్ష్మికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకుడు రాపోలు ప్రభాకర్, సంగెపు విష్ణుమూర్తి, గజం రాజు, చెరుపల్లి రాజు, గంజి వెంకటేశం, చెరుపల్లి సుదర్శన్, రుద్ర మార్కండేయ, వనం రామకృష్ణ, రావిరాల శ్రీను, కర్నాటి రవి, ఆనందపు యాదయ్య, తిరందాసు భిక్షమయ్య పాల్గొన్నారు.

Chandur : చేనేత రుణమాఫీ అమలు చేయాలని ధర్నా