ఆలేరు టౌన్, నవంబర్ 11 : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన త్రిఫ్ట్ పథకం డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో చేనేత కళాకారులు సోమవారం ఆలేరులోని ఎస్బీఐ సోమవారం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు పాశికంటి శ్రీనివాస్ డబ్బును అకౌంట్లలోకి జమ చేయడంలో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రెండు నెలల నుంచి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజూ రేపు, మాపు అంటూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, మేనేజర్ స్పందిస్తూ ఖాతాదారులు ఎక్కువ ఉండడం, బ్యాంకులో సరిపడా సిబ్బంది లేకపోవడం ఆలస్యమైందని, వారం రోజుల్లో జమ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో రచ్చ హనుమంతు, చింతకింది సత్యనారాయణ, కృష్ణ, గణేశ్, వెంకటేశ్, గుజ్జ పాండరి, వాసుదేవు పాల్గొన్నారు.
నాకు పోచంపల్లిలోని కెనరా బ్యాంకులో లక్ష రూపాయలు బాకీ ఉంది. చేనేత పొదుపు కింద నాకు వచ్చిన లక్షా 15 వేల రూపాయలను బ్యాంకు అధికారులు హోల్డ్‌లో పెట్టారు. బాకీ ఉన్నవ్ కాబట్టి అందులో జమ చేసుకున్నాం అంటున్నరు. నాలెక్కనే చాలమంది చేనేతన కార్మికులు డబ్బులు పెట్టుకున్నరు.
-భారత భూషణం, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి
కుటుంబం అంతా కష్టపడి చేనేత పొదుపు పథకంలో పైసలు కట్టినం. ఏపీజీవీబీలో నాకు లోన్ ఉంది. త్రిఫ్ట్ కింద వచ్చిన డబ్బుల్లో 40వేలు నా బకాయి పట్టుకుని 70వేలు మాత్రమే ఇచ్చిండ్రు . స్కీం కింద వచ్చిన డబ్బులన్నీ ఇస్తారనుకున్నం. ఎవరికీ మొర పెట్టుకున్నా మాకు న్యాయం చేస్తలేదు.
– భారత బాలరాజు, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి