చౌటుప్పల్, ఏప్రిల్ 19 : చౌటుప్పల్ హైవేపై మట్టికట్ట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, పాత తాసీల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే సంతోషపడతామని, మంత్రి పదవి కోసం చేస్తున్న పైరవీలు, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం చేయాలన్నారు.
మట్టికట్ట పనులు నిలిపివేసేందుకు తక్షణమే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులను కలవాలని ఆయన ఎమ్మెల్యేకు సూచించారు. లేనిపక్షంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేను తిరుగనివ్వబోమని హెచ్చరించారు. మట్టికట్ట కాకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆందోళనకు సీపీఎం నేతలు, పట్టణంలోని వ్యాపార వర్గాలు, స్థానికులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే ఎన్హెచ్ఏఐ పీడీని కలిసినట్లు తెలిపారు.
మట్టికట్ట నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలు తన దృష్టికి ఎవరూ తేలేదని పీడీ చెప్పారని కూసుకుంట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు చింతల దామోదర్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దిటి బుచ్చిరెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సుర్వి మల్లేశ్ గౌడ్, ముటుకుల్లోజు దయాకరాచారి, తాడూరి పరమేష్, ఢిల్లీ మాధవరెడ్డి, ఊడుగు మల్లేశం గౌడ్, కొయ్యాడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, గడ్డం రాజరత్నం, దేవరపల్లి గోవర్దన్ రెడ్డి, ఎండీ అఖ్తర్ పాషా, తొర్పునూరి మల్లేశ్ గౌడ్, చెవ్వగోని మహేశ్ గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, మున్నా, ముషీర్ తదితరులు పాల్గొన్నారు.