యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు పటిస్తూ అర్చకులు తిరుప్పావై పూజలు నిర్వహించారు. గోదాదేవి రచించిన మొదటి పాశురాలను పఠించారు. ధనుర్మాస విశిష్టత, పాశురాల పరమావధి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఆదివారం, ధనుర్మాసం మొదటి రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.
యాదగిరిగుట్ట, డిసెంబర్17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ధనుర్మాసోత్సవాలకు ప్రధానార్చక బృందం శ్రీకారం చుట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంతో గోదాదేవికి ఆరాధన, అష్టోత్తరం చేపట్టి సేవ కాలాన్ని ప్రారంభించారు. పాశురాలను పఠిస్తూ, అమ్మవారికి హారతినిస్తూ శ్రవణం గావించారు. వేద మంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ధనుర్మాస విశిష్టత, పాశురాల ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు.
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుందని, ఈ మాసంలో భక్తులు ఆలయాలను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పేర్కొన్నారు. గోదాదేవి, రంగనాయకుడిపై రచించిన పాశురాలను రోజుకు ఒకటి చొప్పున 30 రోజులపాటు పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11:30 గంటలకు ఒడిబియ్యం కార్యక్రమం చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలుకుతామని తెలిపారు.
పాతగుట్ట(పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉదయం ఏకకుండాత్మక, పాంచహ్నిక సుదర్శన నారసింహ మహాయాగాన్ని ప్రారంభించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మృత్స్యంగ్రహణం, అంకురారోహణతో మహాయాగం సాగింది. ఈ నెల 21వరకు సుదర్శన నారసింహ మహాయాగం కొనసాగుతుందని ఆలయ ఈఓ గీత తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, డీఈఓ భాస్కర్‌శర్మ, ఏఈఓ రమేశ్‌బాబు పాల్గొన్నారు.
పంచనారసింహుడి క్షేత్రమైన యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసోత్సవం ప్రారంభంతోపాటు ఆదివారం సెలవుదినం కావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే నారసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వామి, తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. స్వామివారి ధర్మ దర్శానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ ఖజానాకు రూ.54,09,081 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి తెలిపారు.