యాదగిరిగుట్ట, జూన్ 18 : యాదగిరిగుట్ట ప్రధానాలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తుల సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొంది. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరు కల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా సాగాయి. సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని విభాగాలు కలుపుకొని శ్రీవారి ఖజానాకు రూ.41,63,554 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరీశుడి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ దంపతులు ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 9.40గంటలకు కొండపైన నిర్మించిన వీవీఐపీ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం కలెక్టర్, ఆలయాధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన లిప్టు సాయంతో ప్రధానాలయంలోకి నేరుగా వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా స్వామివారి ప్రధానాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ముండపంలో జస్టిస్ దంపతులకు ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలోని ముఖ మండపం వద్ద ప్రధానార్చక బృందం వారికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రంతోపాటు స్వామివారి చిత్రపటం, మహాప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎన్.గీత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు ఆలయ ప్రాశస్ర్త్యాన్ని వివరించారు. అనంతరం నూతనాలయాన్ని పరిశీలించారు. అంతకుముందు జస్టిస్ దంపతులకు కలెక్టర్ పమేలా సత్పతి, ఈఓ ఎన్.గీత పుష్పగుచ్ఛం, మొక్క అందించి ఘన స్వాగతం పలికారు.
అద్భుతంగా యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం అద్భుతమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభివర్ణించారు. ఈ సందర్భంగా విజిటర్ పుస్తకంలో గుట్ట నిర్మాణాలపై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. స్వామివారి ఆలయానికి మరోసారి రావాలన్న ఆనందం కలుగుతుందన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన తీరు సంతృప్తినిచ్చిందన్నారు.