ఆత్మకూరు(ఎం), ఏప్రిల్ 22 : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ మండల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేసి 27న జరిగే ఎల్కతుర్తి సభకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్యాగం మరువలేనిదని, ఆయన పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లా కు చెందిన కాంగ్రెస్ మంత్రు లు అభివృద్ధి పనులు చేయకుండా పాలనను గాలికి వదిలేశారని తెలిపారు. అబద్ధాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రజలు తరిమికొడుతారని అన్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేశ్‌గౌడ్, నాయకులు యాస ఇంద్రారెడ్డి, కొరె భిక్షపతి, పూర్ణచందర్‌రాజు, యాస కవిత, ధనలక్ష్మి, అరుణ, శంతన్రాజు, రమేశ్, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిక
మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు నార్కట్‌పల్లి ప్రేమ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.