ప్రభుత్వంపై నిరుద్యోగులు రణనినాదం మోగించారు. హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌పై కన్నెర్ర చేశారు. ఉద్యోగాల సాధన కోసం నడుంబిగించారు. నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ టీజీపీఎస్సీ నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిరుద్యోగులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులు, బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచే నేతల ఇండ్లలోకి వెళ్లి అరెస్ట్ చేశారు. దాంతో నిరుద్యోగులు, బీఆర్ఎస్ నేతలతో పోలీస్ స్టేషన్లు నిండిపోయాయి. మరోవైపు అనేక మంది టీజీపీఎస్సీ ముట్టడికి చాకచక్యంగా తరలివెళ్లారు. ముందస్తు అరెస్ట్‌లతో సర్కారు తీరుపై అన్ని వర్గాలు ఖండించడంతోపాటు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు అనేక హామీలను ప్రకటించింది. తొలి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకటన, నిరుద్యోగ భృతి తదితర హామీలు పత్తాలేకుండా పోయాయి. గత ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులకు చేసిందేమీలేదు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలుగా దాటినా కనీసం పట్టించుకోపోవడంపై నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టారు.
ఇప్పటికే మోతీలాల్ నాయక్ చేసిన నిరాహార దీక్షతో బయటకు వచ్చిన నిరుద్యోగులు బక్క జడ్సన్, అశోక్ సర్ల నిరాహార దీక్షతో రగిలిపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున తరలివెళ్లేందుకు నిరుద్యోగులు ప్లాన్ చేశారు. ముట్టడిని ఎలాగైనా భగ్నం చేయాలని భావించిన ప్రభుత్వం..పోలీసులతో ముందస్తు అరెస్ట్‌లు చేయించింది.
శుక్రవారం ఉదయం నుంచే నిరుద్యోగులతోపాటు బీఆర్ఎస్ నాయకులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాల నేతల ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేయడాన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిరుద్యోగ సమస్యలపై బీజేపీ, బీజేవైఎం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ, బీజేవైఎం నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. అయినా ధర్నా చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.