సూర్యాపేట, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నుంచి నీటిని అందించేందుకు చేపట్టిన పనులను మూడేండ్లలో పూర్తి చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రెండేండ్లు పూర్తవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీటిని అందించే డిండి ఎత్తిపోతల పథకానికి దిక్కు లేకుండా పోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులను పూర్తి చేస్తే … కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంగుళం పని చేయలేదు.
ఎస్ఆర్ఎస్పీ రెండు టన్నెళ్ల మధ్యన గల నక్కలగండి నీటిని స్టోరేజ్ చేసే రిజర్వాయర్ పనులపై కాంగ్రెస్ నేతలు మాటల్లోనే నిర్మిస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కొంత అటవీశాఖ భూమి సేకరణ కోసం పెండింగ్ ఉంది. రెండేండ్లు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలే పరిమితమవుతోంది.
బీఆర్ఎస్ హయాంలో నెలనెలా కోట్లాది రూపాయల పల్లెప్రగతి నిధులతో పల్లెలు వికసించాయి. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో నయాపైసా రాక మళ్లీ ఉమ్మడి రాష్ట్ర దుస్థితికి వస్తున్నాయి. నాడు కోట్లాది రూపాయలు వెచ్చించి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలతో పాటు హరితహారంతో విరివిగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసేందుకు పంచాయతీలకు ట్యాంకర్లను కొనుగోలు చేయడంతో ఎక్కడికక్కడ అడవులు దర్శనమిచ్చాయి. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి సాగ్రిగేషన్ షెడ్లతో ఎరువులు తయారు చేయడం, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు ఇలా అన్నీ సమకూరగా.. నేడు రేవంత్‌రెడ్డి సర్కార్ నిధులు ఇవ్వక అన్నీ కునారిల్ల్లి పోతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, ప్రజలను ఏరీతినైనా మోసం చేయాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీల్లో మీటింగులు పెట్టి తామేదో చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి గప్పాలు కొడుతున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పార్టీలకు సంబంధం లేని స్థానిక ఎన్నికలైనప్పటికీ కాంగ్రెస్ బపపర్చిన అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ వేడుకుంటున్నారని, ఇది కేవలం ఆ పార్టీ అధిష్టానం వద్ద మెప్పు పొంది పదవిని కాపాడుకునేందుకు చేసే కుయుక్తులు తప్ప మరొటి కాదని అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే అబద్దాలు… మోసపూరిత వాగ్దానాలు… మాయామశ్చీంద్ర మాటలు చెప్పారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలను స్వర్గంలో ఉంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి ఫ్లోరైడ్‌తో వంకలు తిరిగిన ఎముకలతో పదిండ్లకో వికలాంగుడిని తయారు చేసిన చరిత్రను స్వరాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథతో ఫ్లోరైడ్‌కు విముక్తి లభించిన విషయం విధితమే. దీనికి తోడు ఏనాడో చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు కాంగ్రెస్ నేతల అసమర్థత, నైపుణ్యం లేని పనితనంతో దశాబ్దాల తరబడి సాగుతూ వస్తోంది. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో దాదాపు 15 కిలోమీటర్ల దూరం పనులు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు సొరంగ మార్గాన్ని మూడేండ్లలో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చినా రెండేండ్లు పూర్తయినా ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఒక ప్లాన్ లేకుండా తొందరపాటు పనులతో సొరంగం కూలిపోగా.. కనీసం అందులో శవాలను కూడా తీయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మళ్లీ ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో ఏమోగానీ సర్వేల పేరిట నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించేందుకు ఇతిమద్దంగా కూడా గడువు చెప్పలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది.