నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్11(నమస్తే తెలంగాణ) /దామరచర్ల : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి వరకు మూడు యూనిట్లను రన్ చేయనున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన హెలికాప్టర్లో దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వచ్చి పనులను పరిశీలించారు.
అనంతరం అక్కడే ఉన్నతాధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రెండో యూనిట్లో ఆయిల్ సింక్రనైజేషన్ ద్వారా పవర్ ఉత్పత్తి ట్రయల్ రన్‌కు స్విచ్ఆన్ చేశారు. అనంతరం ప్లాంట్ కాన్ఫరెన్స్ హాల్లో భట్టి మీడియాతో మాట్లాడారు. ఈ డిసెంబర్ 31 నాటికి మూడు యూనిట్లలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మిగతా రెండు యూనిట్లను కూడా పూర్తి చేసి మొత్తం 5 యూనిట్ల ద్వారా పూర్థి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. మార్చి31 నాటికి విద్యుత్ అందించేందుకు సివిల్ పనులతో పాటు రైల్వే లైన్ పనులను కూడా వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. రైల్వే లైన్ అందుబాటులోకి తేవడం వల్ల బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గుతుందన్నారు.
ఇదే వేగంతో ప్లాంట్‌ను పూర్తి చేయడం ద్వారా యూనిట్ విద్యుత్‌ను 6.35రూపాయలకు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఖర్చును లెక్కకట్టి యూనిట్ ధర ఎంత అవుతుందనేది ఈఆర్సీ నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజలు వారి ఎంతో విలువైన భూములను ఇచ్చి త్యాగం చేశారని, అలాంటి భూ నిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
ప్లాంటు ప్రారంభ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితుల కుటుంబాల్లో నిరుద్యోగులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి ప్లాంట్‌తోపాటు పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం ఆదేశాలిచ్చారని, వారికి నిర్వాసితుల తరపున ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ప్రాజెక్టు డైరెక్టర్లు సచ్చిదానంద, అజయ్, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సమ్మయ్య, తదితరులు ఉన్నారు.
మంత్రులను నిలదీసిన నిర్వాసితులు
యాదాద్రి పవర్‌ప్లాంటుకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిని పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులు, ల్యాండ్ లూసర్స్ బాధితులు అడ్డుకున్నారు. పవర్ ప్లాంట్‌కు భూములు ఇచ్చిన తమకు ఇంతవరకు ఎలాంటి ఉపాధి, ఉద్యోగాలు కల్పించలేదన్నారు. ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని వారిని నిలదీశారు. దీంతో స్పందించిన మంత్రులు నిర్వాసితులకు న్యాయం చేస్తామని, ప్లాంటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులు దేవుళ్లతో సమానమని తెలిపారు. మూడు నెలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.