సూర్యాపేట అర్బన్, జూన్ 9: మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. కాలుష్యం నుం చి పర్యావరణాన్ని కాపాడేందుకు ఆర్టీసీ సంస్థ ముందుకెళుతుందన్నారు. పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ మంత్రి అయిన నాటి నుంచి ఆర్టీసీలో సమూల మార్పులు తెచ్చి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు.
పాత బస్సులు, డీజిల్ బస్సులను పక్కకు పెట్టి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా వాతావరణాన్ని కాపాడుతున్నామన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు సూర్యాపేట డిపోకు 79బస్సులు మంజూరు కాగా 45 బస్సులను ప్రారంభించామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో ఆడపడుచులకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామన్నా రు. తెలంగాణ ఆడపడుచులు రూ.6,088 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని చెప్పారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటూ సూర్యాపేట డిపో నుంచి హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ వంటి ప్రాంతాలకు 79 ఎలక్ట్రికల్ బస్సులు మం జూరు చేశామన్నారు. అందులో 45 బస్సులు ప్రారంభించామన్నారు.
నల్లగొండలో చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసి బస్సులు మంజూరు చేస్తామన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నుంచి వాతావరణాన్ని కాపాడేందుకు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, ఎస్పీ కే నరసింహ, ఎమ్మెల్యేలు మందుల సామే ల్, నలమాద పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్నయాదవ్, సూ ర్యాపేట మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేషాఖాన్, వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.