రామన్నపేట, మే 20 : గవర్నర్ నివాసంలో హార్డ్ డిస్క్‌లు చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధులను దోచుకోవడం కోసమే మూసీ ప్రక్షాళన పేరుతో హడావుడి చేసి పేదల ఇండ్లను కూల్చి వేశారు తప్ప పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో తడిచిన ధాన్యానికి 5కేజీల కోత విధించి రైతులను పాలకులు నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రభుత్వ అధికారులకే రక్షణ కరువైందని, దీనికి చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఇరిగేషన్ అధికారులపై జరిగిన దాడే నిదర్శనమన్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి వేధించడం తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండి పడ్డారు.
ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఇక నైనా అభివృద్ధిపై దృష్టి సారించి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏఎంఆర్, ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలతో చెరువులు, కుంటలను నింపాలన్నారు. అనంతరం మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మెన్ కంభంపాటి శ్రీనివాస్, నాయకులు అంతటి రమేశ్, సాల్వేరు అశోక్, గొరిగే నర్సింహ, ఎస్కే చాంద్, బత్తుల వెంకటేశం, పట్టణ కార్యదర్శి జాడ సంతోశ్, ఎండీ ఆమేర్, మిర్యాల మల్లేశం, కూనూరు శ్రీనివాస్, గర్దాసు విక్రం, బొడ్డు అల్లయ్య, జాడ అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.