నల్లగొండ/సూర్యాపేట టౌన్, అక్టోబర్ 22 : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు తీశారు. నల్లగొండ, యాదాద్రి కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్యయాదవ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. స్కాలర్షిప్స్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు సొంత భవనాలు లేక సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ ఏడాదికి రూ.20వేలు ఇవ్వాలని, ఇంటర్ విద్యార్థులకు మెస్ చార్జీలను రూ.1,500 నుంచి రూ.3వేలకు పెంచాలని కోరారు. బీసీల జనాభా ప్రకారం మరో 120 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 300 కళాశాలల హాస్టళ్లు మంజూరు చేసి స్వంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘ నేతలు ధర్నా విరమించకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు. ఆందోళనల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలగోని వెంకటేశ్ గౌడ్, రాజ్యాధికార సమితి అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి, జిల్లా కార్యదర్శి పరల సాయికుమార్ పాల్గొన్నారు.