నల్లగొండ : పార్క్ చేసిన బైక్‌లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే 25 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకు వెల్లడించారు.
హనుమాన్ పేట ఫ్లైఓవర్ కింద మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. కాగా, పోలీసులను చూసి ఓ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించి చోరీ చేసిన 25 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు వేమూరి కృష్ణ అనే వ్యక్తి చిన్న వయసు నుంచే దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడని ఎస్పీ తెలిపారు. పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అతడి బుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనాలనే తన వృత్తిగా ఎంచుకున్నాడన్నారు.
మిర్యాలగూడ , సూర్యాపేట టౌన్, ఖమ్మం టౌన్ పరిధిలో గల ఏరియాలో రోడ్లపై హ్యాండిల్ లాక్ చేయకుండా పార్క్ చేసి ఉన్న వాహనాలను గుర్తించి తన దగ్గర ఉన్న తాళంతో బైక్‌లను ఎత్తుకెళ్లేవాడు.
కృష్ణపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసు చేధించిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ, సురేష్ కుమార్, ఎస్ ఐ, సైదిరెడ్డి, ఎస్ ఐ, బి సుధీర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ పి వెంకటేశ్వర్లు(V.T) కానిస్టేబుల్స్ కె రవి, ఎస్ వెంకటేశ్వర్లు, ఎం రామకృష్ణను ఎస్పీ అభినందించారు.