నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం రసూల్ గూడలో రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకన్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు వెంకన్న రాజశేఖర్ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు.
అప్పు తీర్చాలని రాజశేఖర్ ఒత్తిడి చేసిండన్నారు. అంతేకాకుండా వెంకన్న, రాజశేఖర్ ఒకే అమ్మాయితో చనువుగా ఉండేవారన్నారు. రాజశేఖర్‌ని హత్య చేస్తే డబ్బు మిగలడంతో పాటు అమ్మాయి విషయంలో అడ్డంకి లేకుండా అవుతుందని వెంకన్న భావించాడు.
పథకం ప్రకారం రాజశేఖర్‌ను రామచంద్రపల్లికి పిలిపించి తాటి ముంజలు కొట్టే కత్తితో హత్య చేశాడన్నారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చి పెట్టారన్నారు. చాకచక్యంగా కేసును చేధించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.