దామరచర్ల, జనవరి 7 :చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదుగాలనే పట్టుదల అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, తండ్రి మరణం కుంగదీసినప్పటికీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తల్లి కష్టం ముందుకు నడిపాయి. అతని పట్టుదల, లక్ష్యం ముందు కష్టాలన్నీ బలాదూర్ అయ్యాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ అనుకున్న గోల్‌ను సాధించాడు దామరచర్ల మండలం బండావత్ తండా గ్రామ పంచాయతీ పరిధి గేరేతండాకు చెందిన అడావత్ సైదులు. ప్రస్తుతం బెంగుళూరు నార్త్ సిటీ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు కర్ణాటక రాష్ట్రంలోని లోకాయుక్త ఎస్పీగా, బళ్లారి ఎస్పీగా పని చేశారు.
గేరే తండాకు చెందిన అడావత్ సైదులు తల్లిదండ్రులు అడావత్ లక్పతి, సోరు. సైదులుకు ఇద్దరు అక్కాచెల్లెండ్లు. వీరికి తండాలో ఎకరం భూమి ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. సైదులు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి 5వ తరగతి వరకు కొండ్రపోల్లోని నేతాజీ పాఠశాలలో చదివాడు. 2002లో మిర్యాలగూడ గిరిజన గురకుల బాలుర పాఠశాలలో 6 నుంచి 10 వరకు చదివాడు. 2004లో ఇంటర్మీడియట్ మిర్యాలగూడలోని వాసవి కాలేజీలో చదివి టౌన్ ర్యాంకు సాధించాడు.
సైదులు మిర్యాలగూడ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి లక్పతి గుండెపోటుతో మరణించాడు. నాటి నుంచి సైదులు కుటుంబంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తల్లి సోరు ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తూ మరొక పక్క కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషించింది. తమ్ముని చదువు కోసం అక్కాచెల్లెండ్లు తమ చదువును మధ్యలోనే మానేశారు. సైదులును మిర్యాలగూడ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. ముగ్గురు వ్యవపాయ పనులు చేస్తూ వచ్చిన ఆదాయంతో సైదులును చదివించారు. సైదులు ఇంటర్ పూర్తి అయిన తర్వాత బిట్స్పిలానీలో సీటు వచ్చినా ఆర్థిక పరిస్థితుల కారణంగా వదిలేసుకున్నాడు.
బీటెక్‌లో సీటు వచ్చినప్పటికీ కనీసం చార్జీలు లేని కారణంగా సైదులు బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని 2008లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరాడు. బీటెక్ చేస్తుండగానే రెండు ఉద్యోగాలకు ఆఫర్ వచ్చింది. తప్పని పరిస్థితుల్లో కు టుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లోని క్యాపిటల్ ఐక్యూ కంపెనీలో చేరాడు. జాబ్ చేస్తూ ఎస్ఎండ్ఆర్ పూర్తి చేశాడు. వచ్చిన జీతం తో అక్కాచెల్లెండ్ల పెండ్లి చేశాడు. తండాలో ప్రభు త్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు.
హైదరాబాద్‌లో జాబ్ చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు సైదులు. 2013లో సివిల్స్ రాసి విఫలమయ్యాడు. 2015లో మరొక సారి రాసి ఐఆర్ఎస్ సాధించాడు. కానీ వెళ్లలేదు. ఎలాగైన ఐపీఎస్, ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో రాత్రిం బవళ్లు చదివాడు. హైదరాబాద్‌లోని గ్రంథాలయాల్లో పుస్తకాలు తిరగేశాడు. మరొక పక్క మూడు నెలలు డీబీ కుమార్ వద్ద శిక్షణ పొందాడు. 2016లో ఐపీఎస్‌లో 795 ర్యాంకు సాధించాడు. 2016లో కర్ణాటక క్యాడర్లో హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. తొలుత బంట్వాల్లో అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరాడు. అనంతరం పదోన్నతిపై బెంగళూరు లోకాయుక్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత బళ్లారి జిల్లా ఎస్పీగా కొంతకాలం పనిచేసి ప్రస్తు తం బెంగళూరు నార్త్‌సిటీ డీసీపీ విధులు నిర్వర్తిస్తున్నాడు.
జీవితంలో తాను పడ్డ కష్టం ఎవరూ పడకూడదని సైదులు పూర్వవిద్యార్థుల సంఘం పేరా ఆల్మని స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాడు. దీని ద్వారా నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, చదువుకు సహాయ, సహకారం అందించడం చేస్తున్నారు. ఈ సంఘంలో సుమారు రెండువేల మంది సభ్యులున్నట్లు సైదులు తెలిపాడు. పాటుగా సొంత గ్రామం గేరేతండా అభివృద్ధికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. సైదులు జీవితం ఆదర్శంగా తీసుకొనేలా తెలంగాణ గిరిజన గురుకుల శాఖ అధికారులు విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలపై సైదులు ఫొటోను, అతని జీవితంలో ప్రధానాంశాలను ముద్రించారు.