చిలుకూరు : అకాల వర్షం చిలుకూరు మండలంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. వాగుల వరద పోటెత్తడంతో చిలుకూరు, నారాయణపురంలోని చెరువుకట్టలు తెగి పంట పొలాలు పూర్తిగా ఇసుకమేటలు వేశాయి. వరి పైరు కొట్టుకొని పోయి పొ లాల్లో రాళ్లు దర్శనమిస్తున్నాయి. వంద ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి నాట్లు వేసిన 20 రోజులకే పంట మాయం అవ్వడంతో రైతుల బాధ వర్ణనాతీతం. గత సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోగా ఈ సారి అధిక వర్షాలతో నీట మునగడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
నారాయణపురం చెరువు మూడు చోట్ల తెగడంతో వరద ఉధృతికి ఇండ్లలోకి నీరు చేరింది. నారాయణపరం, పాలెం అన్నారం గ్రామాల్లోని ఇండ్లల్లో సామాన్లు తడిసి ముద్దయ్యాయి. దాంతో ప్రజలు ఆరుబయటే తలదాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. పాలెఅన్నారం, నారాయణపురంలో నిరాశ్రయులైన వారికి దాతలు భోజన వసతితోపాటు నిత్యావసర సరుకులు అందిస్తూ మానవత్వం చాటుతున్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి, పొలాలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
విరిగిన స్తంభాలు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు
నేరేడుచర్ల : శని, ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. రోడ్లు, పంటలు, చెరువులు, కుంటలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఇప్పుడుప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆయా శాఖల అధికారులు నష్టం అంచనాను మొదలు పెట్టారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో సుమారు రూ. 70 లక్షల మేర విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లినట్ల అధికారులు అంచనా వేశారు. హుజూర్నగర్ సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో రూ. 58 లక్షలు, కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెర్వు మండలాల్లో సుమారు రూ. 12 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
అత్యధికంగా హుజూర్నగర్, మఠంపల్లి గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో విద్యుత్ వ్యవస్థ బాగా దెబ్బతినగా చింతలపాలెం, మేళ్లచెర్వు, నేరేడుచర్ల మండలాల్లో స్వల్పంగా ఉన్నది. నియోజకవర్గ వ్యాప్తంగా 834 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా 59 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. సుమారు 50 కిలోమీటర్లకు సరిపడా విద్యుత్ వైర్లు తెగిపోయాయి. స్తంభాలు విరిగినా, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే తమ సిబ్బంది విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పునరుద్ధరించారని హుజూర్నగర్ విద్యుత్ శాఖ ఏడీఈ సక్రునాయక్ తెలిపారు.