నిడమనూరు, ఏప్రిల్ 23 : దళిత క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణకు ఈ నెల 24న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ పెదమాం డేవిడ్ రాజు పిలుపునిచ్చారు. నిడమనూరు మండల కేంద్రంలో గురువారం జరిగిన ఏఐసిఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొననున్న సభకు దళిత క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు అంశంపై రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
బీసీ, ఎస్టీ, ఓసి సామాజిక వర్గాలకు లేని అభ్యంతరాలు దళిత క్రైస్తవులకు మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా ఆపాదించడం దారుణమన్నారు. ఈ సమావేశంలో నియోజక పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు నంద్యాల ఎలిశా రావు, నిడమనూరు మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యకుడు యోహాను, ఏఐసీఎఫ్ మండల కమిటీ నాయకులు జెరీపోతుల జాషువా, కోకా రాములు, అభిషేక్ పాస్టర్, ప్రభుచరణ్, క్రాంతి పాల్గొన్నారు.