సూర్యాపేట, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పాల ఉత్పత్తి చేసే పాడి రైతుల పరిస్థితి దీనంగా మారుతోంది. ప్రతి నిత్యం నార్మూల్ డెయిరీకి పాలు పోసే రైతులకు గతంలో ప్రతి పదిహేను రోజులకోసారి బిల్లులను వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాడి రైతుల దుస్థితి చెప్పనలవి కాకుం డా ఉంది. నాలుగు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో బాకీ దాదాపు రూ.ఆరు కోట్ల వరకు పెండెంగ్లో ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మదర్ డెయిరీ ఎదుట పాడి రైతులు బిల్లుల కోసం నిరసన చేపట్టారు.
రెండేండ్లుగా పాల ధర పెంచని కాంగ్రెస్ కనీ సం పాడి రైతులకు పాల బిల్లులైనా సక్రంగా చెల్లించడం లేదు. పదిహేను రోజులకోసారి బిల్లులు చెల్లించే ఆనవాయితీని తుంగలో తొక్కారు. నాలుగు నెలలుగా జిల్లాలోని రైతులకు దాదాపు రూ.6 కోట్ల బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లుల జాప్యంతో కొందరు పాల ఉత్పత్తిదారులు బయట ప్రైవేట్లో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. పల్లీ చెక్క, తవుడు, మక్కపిండి తదితరాల ధరలు పెరగడం.. పశువులకు ఏదైనా వ్యాధి సోకినా చికిత్స, మందులకు డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణాలతో గేదెలను కొనుగోలు చేసిన రైతులు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు. కిస్తీలు కట్టాలని ఒత్తిడి పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల ఉత్పత్తిని బట్టి ఒక్కో రైతుకు నెలలకు సగటున రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు పాల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
మరోపక్క అన్నింటి ధరలు గణనీయంగా పెరిగిపోవడం, బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పాడి రైతులకు పశుపోషణ భారంగా మారుతోంది. 8 నుంచి 10 లీటర్ల పాలు ఇచ్చే ఆవు లేదా గేదెకు రోజుకు 5 కిలోల దాణా పెట్టాల్సి ఉంటుందని, జెర్సీ ఆవు, ఇతర ఆవులకు ఖర్చు అధికంగా ఉంటుందని అంటున్నారు. ఇంత చేస్తే కనీసం నెలనెలా పాల బిల్లులను సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మదర్ డెయిరీ ఎదుట పాడి రైతులు బిల్లుల కోసం నిరసన కార్యక్రమం చేపట్టారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నార్మూల్ మదర్ డెయిరీ నుంచి పాల బిల్లులు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలకు నిలయంగా మారిన రైతు కుటుంబాలకు తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగంగా మారింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులను బలోపేతం చేసేందుకు చేపలు, గేదెలు, ఆవులు, గొర్రెల పంపిణీ చేసి మరింత బలోపేతం చేశారు. రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతున్నల పరిస్థితి దయనీయంగా మారింది. కేసీఆర్ హయాంలో రైతులు పాడి పోషణపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో పాల ధరను పెంచారు. సహకార సంస్థల్లో పాలను విక్రయించిన రైతులకు లీటరు ధర పెంచుకుంటూ పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు పాల రేట్లను తగ్గించింది. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ మూడు సెంటర్లలో మూడు పాల శీతలీకరణ కేంద్రాలు, 38 సొసైటీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,500 మంది రైతులు ఉన్నారు. ప్రతినెలా సుమారు రూ.కోటిన్నర విలువ చేసే లక్షన్నర లీటర్ల పాలు పోస్తున్నారు.