యాదగిరిగుట్ట, మార్చి 13 : నాలుగు నెలలుగా పాల బిల్లులు ఇవ్వడం లేదు.. ఎగ్గొడుదామని చూ స్తున్నారా అంటూ నార్ముల్ సంస్థపై పాడి రైతులు మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం మండలంలోని మల్లాపురంలో గల నార్ముల్ పాల సేకరణ కేంద్రం వద్ద గురువారం పాల క్యాన్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్ ఒగ్గు భిక్షపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ సాగునీరు లేక, సరిగ్గా కరెంటు రాక పంటలు ఎండిన రైతులు పాల బిల్లు అయినా ఆసరా అవుతుందని భావిస్తే నిరాశే మిగిలిందన్నారు.
గతేడాది మదర్ డెయిరీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల గ్రాంట్, లీటర్ పాలకు రూ.5 బోనస్, నెలనెలా ఒకటో తేదీన బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామని చెప్పిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మల్లాపురంలో 27 మంది పాడి రైతులకు రూ.5 లక్షల వర కు బిల్లులు రావాల్సి ఉన్నాయని తెలిపారు. పాలక వర్గం స్పందించి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొండం సత్తయ్యగౌడ్, పారుపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల నాగరాజు, మన్నెపు శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల సాదు, పల్లెపాటి శేఖర్, శిఖ ఉపేందర్‌గౌడ్, కళ్లెం రాజుగౌడ్, శిఖ నర్సింహులు, కర్రె చంద్రశేఖర్, ఎండీ ఇమ్రాన్, ఒగ్గు భిక్షపతి, శివప్రసాద్, సంపత్ పాల్గొన్నారు.