తిప్పర్తి, సెప్టెంబర్ 15 : నాగార్జునసాగర్ నిండుకండలా తొణికిసలాడుతున్నా ఏఎమ్మార్పీ పరిధిలోని రైతులకు సాగు నీరు అందడం లేదు. అధికారుల నిర్వహణ లోపం డీ-40 కాల్వ ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. మొదట కాల్వకు నీళ్లు ఇచ్చినా గండ్లు, ఏపుగా పెరిగిన కంపచెట్ల కారణంగా పంటలకు సాగు నీరు అంద లేదు. గండ్లు పూడ్చేందుకు వారం కింద నీటి విడుదల ఆపేసిన అధికారులు, ఆ తర్వాత పుట్టంగండి వద్ద మోటార్ రిపేర్ అయ్యిందని తిరిగి పునరుద్ధరించకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దాంతో ఐదు మండలాల రైతులు అవస్థలు పడుతున్నారు.
డీ-40 కాల్వ కింద మొత్తం 27,100 ఎకరాల ఆయకట్టుకుగానూ కుడివైపు తొమ్మిది, ఎడమ వైపు పది సబ్ కెనాల్స్ ఉన్నాయి. ఇది కట్టంగూర్ మండలం బొల్లెపల్లి నుంచి మాడ్గులపల్లి మండలం సీత్యాతండా వరకు 22.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ కాల్వల ద్వారా కట్టంగూరు, తిప్పర్తి మండలంతోపాటు మాడుగులపల్లి, వేములపల్లి మండలాల రైతులు తమ పొలాలు సాగు చేసుకుంటున్నారు. ప్రారంభంలో రైతులు పెట్టే అక్రమ గండ్ల కారణంగా చివరనున్న రైతులకు సాగు నీరు అందలేదు. మరోవపు కాల్వలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో కంప చెట్లు కాల్వ నిండిపోయాయి. దాంతో కాల్వ పొంగి తరుచూ గండ్లు పడడం జరిగింది. ఇటీవల తిప్పర్తి మండలంలోని ఇండ్లూరు-వెంకటాద్రి పాలెం వద్ద ఈ కాల్వకు గండి పడటంతో సమీప రైతుల పంటలు మునిగాయి. దీన్ని పూడ్చడానికి అదికారులు నానా యాతన పడాల్సి వచ్చింది. డీ 40 కాల్వకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. వానకాలం సీజన్ ముగిసే దశకు వచ్చినా నేటికీ కాల్వకు నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించి వెంటనే నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
మోటర్లు రిపేరు వల్ల ప్రారంభంలో నీళ్లు రాలేదు. మోటర్ రిపేరు అయిన తర్వాత పూర్తిగా నీళ్ల్లు వస్తున్నాయ్. ఏఎమ్మార్పీకి వారంబందీ పద్ధతితో నీళ్లు వదులుతున్నాం. ప్రస్తుతం సగం వరకే నీళ్లిచ్చాం. మరో దశలో కాల్వ చివరి వరకు నీళ్లు ఇస్తాం. అక్కడక్కడ రైతులు పెట్టిన అక్రమ గండ్లను గుర్తించి తొలగించాం. సిబ్బందితో ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయిస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా కింది వరకు సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
నాకు మూడెకరాల భూమి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాల్వ మంచిగ పారింది. నా చెల్క మొత్తం అచ్చుగట్టిన. ఎనిమిదేండ్లు వడ్లు పండినయి. ఈ ఏడు మొన్న యాసంగిలో కాల్వ రాక బోరు కూడా పొయ్యలేదు. ఇప్పడు సాగర్లో నీళ్లు ఉన్నా ఇవ్వడం లేదు. అప్పడప్పుడు గిన్ని గిన్ని వస్తే కనీసం తూకం మడి కూడా పారుతలేదు. కాల్వ వస్తుందని ఇంకో మడి దున్నితే అప్పుడే కాల్వ పోయింది. మళ్లీ ఎప్పుడొస్తుందో ఏమో. నిన్నమొన్న వర్షాలొచ్చి కొంత మేలు అయ్యింది. తొందరగా కాల్వకు నీళ్లిచ్చి ఆదుకోవాలి.
నాకు 10ఎకరాల భూమి ఉంది. కాల్వకు నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న బో ర్లు సరిగా పోయక మూడు ఎకరాలే నాటు పెట్టిన. అది కూడా కొసెల్తెదో లేదో అన్నట్టుంది. చాలామంది రైతులు భూములు పడావు బెట్టుకుండ్రు. నీళ్ల కోసం గతంలో ఇంతగానం ఇబ్బంది పడలేదు. ముందున్న రైతులు కొందరు కాల్వకు గండికొట్టి గూనలు వేసుకుండ్రు. అధికారులు వాటిని తీయించాలి.