సూర్యాపేట, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిర్వహణ అక్రమాలకు అడ్డాగా మారింది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు డబ్బులు తీసుకొని నాణ్యతలేని బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ తీసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని పలు మిల్లుల నుంచి వచ్చిన దాదాపు 25 లారీల నాణ్యత లేని బియ్యానికి కింది నుంచి పై స్థాయి వరకు ఒక్కో లారీ నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని అప్రూవల్ ఇచ్చినట్లు సమాచారం. సీఎంఆర్‌లో జరుగుతున్న అక్రమాలపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్తలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన సివిల్ సప్లయ్ శాఖలోని ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్ వ్యవహారం అధికారులు గుట్టుగా ఉంచగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి తోడు జిల్లాలో మిల్లర్స్ అసోసియేషన్ రెండుగా చీలి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం అక్రమాలు బయటపడుతున్నాయి.
సీఎంఆర్ సేకరణలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రికలో కొన్ని వార్తలు ప్రచురితం కావడంతో హైదరాబాద్ నుంచి ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. ఓ ఉన్నతాధికారికి కారును హైదరాబాద్‌లోని ఓ షోరూంలో కొనుగోలు చేసి ఇచ్చినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇన్వాయిస్ సంపాదించినట్లు సూర్యాపేటలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ శాఖలకు కేటాయించడంలో జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఓ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యుడొకరు జిల్లాలోని మిల్లుల నుంచి సివిల్ సప్లయ్ అధికారులకు డబ్బులు ఇవ్వాలని దాదాపు రూ.4.5 కోట్లు వసూలు చేసి ఎవరికీ ఇవ్వకుండా మిన్నకున్నాడు. ఇది తెలుసుకున్న సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీలు చేసి సివిల్ సప్లయ్ గోదాముల్లో ఉన్న 25 లారీల బియ్యం నాణ్యత లేదని రిజెక్ట్ చేశారు. పూర్తి స్థాయి రిపోర్టును సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్‌కు అందజేయడంతో ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. క్వాలిటీ చెక్ చేయకుండా నాణ్యత లేని బియ్యాన్ని సీఎంఆర్‌కు పాస్ చేయడం పట్ల ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు సివిస్ సప్లయి సూర్యాపేట జిల్లా మేనేజర్ పెరుమాండ్ల రాములు ధ్రువీకరించారు. జిల్లాలో సివిల్ సప్లయ్‌కి ఇచ్చిన సీఎంఆర్‌ను పూర్తి స్థాయిలో విచారణ చేస్తే దాదాపు 70 శాతం నాణ్యత ఉండవని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లు, దానికి లక్షలో మామూళ్లు తీసుకొని సహకరించిన అధికారులపై చర్యలు చేపట్టాలని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరిస్తున్న ఓ మిల్లు యజమాని చెబుతున్నాడు.