సూర్యాపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కొంతమంది అక్రమార్కులకు వరంలా మారింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయట అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ఇందులో అధికారులను వాటాదారులుగా చేసుకుంటున్నారు. ఒక వేళ అక్రమాలు బయటపడినా కేసులు నమోదవడం, జైలుకెళ్లడం పరిపాటిగా మారింది. దాంతో ప్రభాత్వానికి భారీ నష్టం చేకూరుతున్నది. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి మిల్లర్లు ఇచ్చే మామూళ్లతోనే ఇలా జరుగుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అందజేస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన అనంతరం మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అందిస్తారు. కానీ సూర్యాపేట జిల్లాలో కొంతమంది అక్రమార్కులు వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. ఇందులో 20 నుంచి 25 శాతం అధికారులకు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిల్లుల్లో ధాన్యం మాయమవుతున్నప్పటికీ తనిఖీలు చేసిన అధికారులు మాత్రం రిమార్కులు చూపించడం లేదు. తొలుత తిరుమలగిరిలోని రెండు మిల్లులను సీజ్ చేయగా, దానికి ముందు ఏడాది పాటు దాదాపు 14 సార్లు తనిఖీలు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. కానీ ఏనాడూ తక్కువ ధాన్యం స్టాక్ ఉన్నట్లు చూపించలేదు. అంతేగాక ఆ రెండు మిల్లులపై కేసులు నమోదు చేసిన సమయంలో సుమారు రూ.20 కోట్ల ధాన్యం ఉంది. కానీ వాటిని స్వాధీనం చేసుకోలేదు. రెండు నెలల పాటు మిల్లులు నడిపి ఉన్న ధాన్యాన్ని అమ్ముకుంటుంటే మామూళ్లు తీసుకున్నారు తప్ప కట్టడి చేయలేదని పేరు బహిర్గతం చేయడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు చెబుతున్నారు.
తిరుమలగిరి మండలంలోని సోమనర్సయ్యకు చెందిన రెండు రైస్ మిల్లుల్లో సుమారు రూ.180 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అలాగే కోదాడ మండలం కొమరబండ వద్ద ఉన్న నీలా సత్యనారాయణకు చెందిన శ్రీవెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో రూ.64 కోట్ల విలువ చేసే ధాన్యం, గరిడేపల్లి సమీపంలోని ఎంకేఆర్ మిల్లులో ధాన్యం మాయమైన తర్వాత కేసులు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం తిరుమలగిరి మండలంలోని శ్రీలక్ష్మి ట్రేడర్స్, హర్షిత ట్రేడర్స్ రెండు మిల్లుల్లో రూ.40 కోట్ల ధాన్యం మాయమైందని హైదరాబాద్ నుంచి వచ్చిన టీములు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ రెండు మిల్లుల్లో ధాన్యం మాయమైందని మీడియాలో వచ్చింది. అప్పుడు అధికారులను అడిగితే అవునని చెప్పినా సీజ్ చేయకుండా, చర్యలు తీసుకోకుండా వదిలేశారు. నాలుగు నెలల క్రితం ఆ రెండు మిలుల్లో దాదాపు రూ.20కోట్లకు పైనే ధాన్యం ఉండగా వాటిని స్వాధీనం చేసుకోకపోవడంతో అవి కూడా మాయమయ్యాయి. ఆ తరువాత కేసులు నమోదు చేయడం పట్ల జిల్లాలోని మిల్లర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని మరో నాలుగైదు మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పెద్దఎత్తున మాయమైనట్లు తెలుస్తున్నది. అధికారులు స్పందించి అన్ని మిల్లుల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. తాత్సారం చేస్తే ఉన్న ధాన్యం కూడా విక్రయించుకున్న తర్వాత అధికారులు కేసులు నమోదు చేస్తే ఏం లాభం పలువురు పేర్కొంటున్నారు.