ఆత్మకూర్.ఎస్, మార్చి 27 : ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరితోపాటు మిర్చి కూడా సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు వస్తాయని భావించి వేలకు వేలు పెట్టుబడి పెట్టారు. కానీ, నీళ్లు రాక రెండు పంటలూ ఎండిపోవడంతో ఆర్ధికంగా కుంగిపోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పొలాల్లో పశువులు, గొర్లు, మేకలు మేపుతున్నారు.
మిర్చి పంట దాదాపు 250 ఎకరాల్లో ఎండిపోవడం గమనార్హం. రామోజీతండాకు చెందిన షేక్ రహీమ్ తనకున్న ఎనిమిది ఎకరాల్లో మూడెకరాల్లో మిర్చి, ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో రెండు పంటలూ ఎండిపోయాయి. దాంతో పశువులను మేపుతున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొలాలకు 24గంటలు నీళ్లు వచ్చేవని, ఎక్కడా ఎకరం కూడా బీడుగా లేదని రహీమ్ చెప్తున్నారు.
ఇప్పడు నీళ్లు లేక పంటలు ఎండి పెట్టుబడికి తెచ్చిన అప్పులు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తండాకు చెందిన మహిళా రైతు షేక్ చాంద్‌బీ ఐదెకరాల్లో రెండెకరాల్లో వరి, ఎకరన్నరలో మిర్చి తోట సాగు చేశారు. నీళ్లు లేక పంటలు పూర్తిగా ఎండిపోవడంతో పశువులను మేతకు వదిలిపెట్టారు. కాల్వ నీళ్లు లేకపోవడం వల్ల బోర్లు కూడా ఎండిపోయి రైతులు గోస తీస్తున్నారని చాంద్‌బీ ఆవేదన చెందారు.