రైతులకు సాగు కష్టాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమఅవుతున్నది. డిసెంబర్ 28 నుంచి విడుతల వారీగా అందరికీ అందజేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం వరకు 7,66,691 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.65 కోట్ల నగదు వేసింది. సాయం అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు.
– యాదాద్రి భువనగిరి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)
రైతులు సాగుకోసం అప్పులు తెచ్చి ఆగం కావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం దిగ్విజయంగా అమలవుతున్నది. ఈ ఏడాది యాసంగి సాగుకు ప్రభుత్వం అందిస్తున్న పదో విడుత పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభం కాగా సోమవారం వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన 7,66,691 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.65 కోట్లు జమ అయ్యాయి.
రైతు బంధు డబ్బులు ఖాతాల్లో పడడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాల్లో పడిన డబ్బులు డ్రా చేసుకునే వారితో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద సందడి వాతావరణం నెలకొంటున్నది. యాసంగి సీజన్ ప్రారంభం కావడం, సమయానికి డబ్బులు చేతికందంటంతో రైతులంతా ఉత్సాహంగా పొలం పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయంతో కొందరు ఎరువులు కొనుగోలు చేయగా, మరికొందరు కూలీలకు, ఇంకొందరు దున్నకాలకు ఉపయోగించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ వల్లే వ్యవసాయానికి అప్పుల బాధ తప్పిందని, ఆయన రుణం తీర్చుకోలేమని రైతులు చెబుతున్నారు.
– యాదాద్రి భువనగిరి, జనవరి 2 (నమస్తే తెలంగాణ)

రైతుబంధుతో రైతులకు ధీమా
నాకున్న రెండెకరాల పదిగుంటలకు రైతుబంధు కింద రూ.12వేలు నా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఆ డబ్బులు పెట్టుబడి ఖర్చులకు సరిపోతాయి. సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధుతో సాగుకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో వ్యవసాయం దండుగ అన్నట్లుంటే.. నేడు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పండుగలా మారింది. రైతుల బాగు కోసం ఇంతలా ఆలోచించే నాయకుడు ఈ దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కడే.
– ఎ.నాగరాజు, రైతు, లక్ష్మీదేవిగూడెం, వేములపల్లి
మేలు చేసే సర్కార్ను చూస్తున్నం
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం మాలాంటి నిరుపేద రైతులకు ఎంతగానో ఆసరా అవుతుంది. రైతులకు సాగుకోసం పెట్టుబడి అందిస్తున్న సర్కార్ను ఇప్పుడే చూస్తున్నం. ప్రభుత్వం సాయం చేస్తుండడంతో మాకు అప్పుల బాధ తప్పింది. నాకున్న రెండు ఎకరాలకు రూ.10వేల రైతుబంధు డబ్బులు నా ఖాతాలో జమ అయ్యాయి. అనేక పథకాల ద్వారా రైతులకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరువలేం.
-ముప్పిడి యాదయ్య, పందనపల్లి, కట్టంగూర్
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యారు. ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరాకు ప్రతి సంవత్సరం రూ. 10వేల సాయం అందిస్తున్నది. దాంతో అప్పులు లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నం. దాంతో పాటు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం, సాగునీరు పుష్కలంగా వస్తుండడంతో సాగుకు ఫికర్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు.
– కొమ్ము మల్లేశ్, రైతు, రావిగూడెం, మునుగోడు
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు. రైతు బంధు ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండడంతో సాగుకు రందీ లేకుండా పోతోంది. గతంలో పంట పెట్టుబడికి రెండు రూపాయల మిత్తికి అప్పు తెచ్చి సాగు చేసేటోళ్లం. గిప్పుడు ప్రభుత్వమే డబ్బులిస్తుండడంతో రూపాయి కూడా ఎవ్వరినీ అడగడం లేదు. నాకున్న రెండు ఎకరాలను సాగు చేసుకుంటూ దర్జాగా బతుకుతున్న. పెట్టుబడి సాయంతో పాటు ఎరువులు, కరెంటు, విత్తనాలు అందించడంతో పాటు పండిన పంటను కూడా కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్ ఉన్నంత వరకూ మా కెలాంటి ఇబ్బందీ లేదు.
– సీహెచ్. లింగయ్య, రైతు, సిలార్మియాగూడెం, తిప్పర్తి
రైతుబంధు సాయంతో సాగుపనులు
సీఎం కేసీఆర్ పెట్టుబడి కోసం మాకు అందించిన రైతుబంధు డబ్బులతో సాగు మొదలు పెట్టినం. గతంల పెట్టుబడి కోసం అవస్థలు పడేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం అందించే డబ్బులు టైంకు అందుతుండడంతో ఎవ్వరివద్ద చేయి చాపాల్సిన అవసరం లేదు. నాకు 30 గుంటల భూమి ఉంది. ఈ రోజు రైతుబంధు పైసలు నా బ్యాంకు ఖాతాలో జమైనట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది.
– పెరమాళ్ల జయమ్మ, రైతు,మునుగోడు
నాకు రెండుకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం అమలైనప్పటి నుంచి నా బ్యాంకు ఖాతాల డబ్బులు పడుతున్నయ్. గతంల రైతులను పట్టించుకున్నోళ్లే లేరు. కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మా బాధలు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు చొప్పున ఇస్తున్నది. దాంతో పాటు పుష్కలంగా కరెంటు, నీళ్లు ఇస్తుండడంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పోయినయ్. రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
-జిట్టగోని సైదులు,రత్తిపల్లి, మునుగోడు.