రామగిరి( నల్లగొండ), మార్చి 31 : వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా ప్రార్ధన స్థలం దగ్గర నల్ల రిబ్బన్లు ధరించి సీపీఎం ఆధ్వర్యంలో ముస్లింలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హశం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.సలీం మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లు మతపరమైన హక్కులకు భంగం కలిగిస్తుందని, వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతం కలిగిస్తుందని, వక్ఫ్ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లు-2024ను ఆగస్టు 8, 2024 రోజున పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపిందన్నారు. మొత్తం 31 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలు సేకరించగా 5 కోట్ల మంది బిల్లులోని సవరణలు వ్యతిరేకిస్తూ జేపీసీకి వినతులు సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
కమిటీ 421 పేజీల నివేదికను 13 ఫిబ్రవరి 2025న లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టింది. బిల్లుకు ప్రతిపాదించిన మొత్తం 44 సవరణల్లో 14 సవరణలు స్వల్ప మార్పులు చేస్తూ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఆమోదించింది. ప్రతిపక్ష ఎంపీలు ఈ సవరణలు వ్యతిరేకిస్తూ ఇచ్చిన అసమతులను రిపోర్ట్ నుంచి తొలగించారని, ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల్లో గట్టిగా నిలదీయడంతో అసమ్మతులను తిరిగి చేర్చారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఓటింగ్ కి రాబోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తున్నది ఆస్తులను రక్షించడం కోసం కాదని, ఆస్తులను ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్ర అని విమర్శించారు. ఒక బోర్డ్ పరిధిలో ఉన్న లక్షల ఎకరాలపై కార్పొరేట్లకు, శ్రామికవేత్తలకు కట్టబెట్టే కుట్రలో భాగమని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సభ్యులు ఊట్కూరి మధుసూదన్ రెడ్డి ఎగ్బాల్ సాజిద్, మైనారిటీ నాయకుడు, అడ్వకేట్ నజీరుద్దీన్, కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, ఖలీల్, ఎగ్బాల్, అజీజ్, సోయబ్, అఖిల్, షకీల్ పాల్గొన్నారు.