నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నాయకులు ఆరోపించారు.
యాసంగిలో రైతులు పండించిన వడ్లను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెంటనే కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనకపోవడంతో కళ్లాల వద్దే రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చాలా చోట్ల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయి రైతులు అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.