మునుగోడు, మార్చి 10 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను సోమవారం సిపిఎం నాయకులు పరిశీలించారు. ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలంటూ ఎస్సారెస్పీ కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. జిల్లా నాయకుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పంటలు ఎండిపోతుంటే కనిపిస్తలేదా అని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మీరు చేసే న్యాయం ఇదేనా అని విమర్శించారు. మిగిలిన పంట పొలాల కన్నా నీళ్లు ఇచ్చి రైతులని ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పంట పొలాలను సర్వే చేసి ఎకరాకు రూ.30 వేల పంట నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.