భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 28 : ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అనేకమంది అర్హులు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే బస్వాపూర్ రిజర్వాయర్, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని, గంధమల్ల, శివన్నగూడెం ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు.
ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం కరువైందని, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్యం అందక గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. నీళ్లు లేక వరి పంటలు ఎండిపోయి అనేక మంది రైతులు నష్టాల బారిన పడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హకులను కాలరాస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలని రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయి పేద ప్రజలకు అందించడంలో విఫలమైందని అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పహల్గామ్లో జరిగిన దాడి కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగం నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనూరాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసాచారి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, సిర్పంగి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, ఎండీ పాషా, బొల్లు యాదగిరి, గంగదేవి సైదులు, మద్దెల రాజయ్య, గడ్డం వెంకటేశ్, ఎంఏ ఇక్బాల్, వనం ఉపేందర్, కోట రామచంద్రారెడ్డి, రాగీరు కిష్టయ్య, బల్గూరి అంజ య్య, గోశిక కరుణాకర్ పాల్గొన్నారు.