మునుగోడు, అక్టోబర్ 03 : మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ(ఎం) సిద్ధంగా ఉందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. శుక్రవారం మునుగోడు మండలంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేద ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా, ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించే సీపీఎం పోటీ చేసే స్థానాల్లో గెలిపించేందుకు పేద ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఎర్ర జెండాకున్న పోరాట చరిత్ర, ప్రజలలో చెదరని ముద్రగా నిలిచి ఉంటుందన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలన్నారు.
డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టి బరిలో నిలిచే నాయకులను ఓడించి, పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసే సీపీఎం నాయకులను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు పోరాటం చేసే ఎర్రజెండాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కర్నాటి మల్లేశం, మాజీ ఎంపీటీసీలు చాపల మారయ్య, టి.గోపాల్ రెడ్డి, మునుగోడు, మర్రిగూడ, చండూరు మండల కార్యదర్శిలు సాగర్ల మల్లేష్, ఏర్పుల యాదయ్య, జేరిపోతుల ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి, శ్రీను పాల్గొన్నారు.