అనంతగిరి, నవంబర్ 21 : ప్రజా ఉద్యమాల్లో మహోన్నత చరిత్ర కలిగిన సిపిఐ పార్టీకి వందేళ్లు పూర్తవడం సంతోషంగా ఉందని,
పేదల పక్షాన నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. పార్టీ వందేళ్ల ప్రస్థానంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు జాత శుక్రవారం అనంతగిరి మండలంలోని శాంతినగర్‌కు చేరుకుంది. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు జాతాకు డప్పులు, బాణాసంచాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీతో స్థూపం వద్దకు చేరుకుని అమరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని మొట్టమొదటగా గర్జించిన పార్టీ సీపీఐ అన్నారు. పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ నుండి దేశ వ్యాప్తంగా ఉత్సవాలు ఉత్సహంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
బ్రిటిష్ వారి నుండి దేశ విముక్తికి రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారన్నారు. సిపిఐ కార్యకర్తలను నిర్బంధాలు చేసినా, జైలులో పెట్టిన అలుపెరగకుండా కార్మిక, విద్యార్థి, యువజన, రైతు, మహిళా, ప్రజా సంఘాలను నిర్మించుకుని వెట్టి చాకిరి విముక్తి కొరకు కార్మికులు, కర్షకులను దోపిడీ నుండి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు సిపిఐ నిర్వహించిందని తెలిపారు. పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది కమ్యూనిస్టు పార్టీ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి భారత గడ్డపై వంద ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా డిసెంబర్ 26న ఖమ్మంలో లక్షలాది మందితో జరిగే సిపిఐ ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, నారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే సాయి బల్లి, ఎస్కే లతీఫ్, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన, మండల కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి లాలు, యువజన సంఘం అధ్యక్షుడు డేగ వీరయ్య, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, నాగభద్రం, కార్యదర్శి వీరబాబు, మహిళా కామ్రేడ్స్ పాల్గొన్నారు.