యాదగిరిగుట్ట, జనవరి 15 : చైనా మంజా తగిలి దంపతులు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ తన భార్య వీరమణితో కలిసి ద్విచక్ర వాహనంపై యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు రాగానే చైనా మాంజా నారాయణ గొంతుకు తగిలి గాయమైంది. దాంతో వాహనాన్ని ఒక్కసారిగా నిలుపడంతో వెనుక కూర్చున్న వీరమణి కిందపడిపోగా తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి వెళ్లింది. గమనించిన స్థానికులు వెంటనే 108 సాయంతో భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
బీబీనగర్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్‌కు చెందిన దాసరి రాము బుధవారం తన సొంత పనుల నిమిత్తం భువనగిరికి వెళ్లాడు. తిరిగి బోడుప్పల్‌కు వెళ్తుండగా.. బీబీనగర్ మండలంలోని ఫ్లైఓవర్ మీద చైనా మాంజాతో కూడిన తెగిన గాలి పటం తగిలి చేతికి, గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన డాక్టర్లు మెడతోపాటు చేయి తెగిందని తెలిపి చికిత్స అందించారు.