నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): పత్తి రైతులకు ఈ సీజన్ కన్నీళ్లే మిగిల్చింది. ఓ వైపు ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరోవైపు పాలకుల తీరుతో పత్తి రైతు పరిస్థితి ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది. దీంతో పత్తి రైతులకు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు రావడం కూడా కష్టమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి తర్వా త అత్యధికంగా సాగయ్యేది పత్తి పంట నే. సాగర్ ఆయకట్టు మినహాయిస్తే నాన్ ఆయకట్టులో రైతులంతా పత్తి పంటకే ముగ్గు చూపుతారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 7.81లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వర్షాలతో మెజార్టీ భాగం పత్తి పంట దెబ్బతిన్నది. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలతో తడిసి ముద్దయింది.
దీంతో ఓ వైపు దిగుబడిపై తీవ్ర ప్రభావం పడగా మరోవైపు అంతంత మాత్రంగా చేతికి వచ్చిన పత్తి లో సైతం నాణ్యత కొరవడింది. ఇదే సమయంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం, కొనుగోలు సంస్థ సీసీఐ మీనమేషాలు లెక్కి స్తూ వచ్చింది. నేటికీ జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు కాలేదంటే అతిశయోక్తి కాదు. నల్లగొండ జిల్లాలో బుధవారం నాటికి కేవలం 6476 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారంటే కొనుగోళ్ల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది.
అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా లో 5.68లక్షల ఎకరాల్లో, యాద్రాదిలో 1.21 లక్షలు, సూర్యాపేటలో 92,588 ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగైంది. సాగు చేసిన ప్రతి రైతు పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ మొబైల్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి. ఇలా చేయకుంటే పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనే కొనుగోలు చేయరు. పత్తి పండించే రైతు కచ్చితంగా ఆధార్ కలిగి ఉండాలి. ఆధార్ ధ్రువీకరణ చేసుకున్నాకే పత్తి కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది.ఇప్పటికే చాలామంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ఉన్నా అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోవ డం లాంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి.
దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు. దీంతో రైతులకు యాప్‌లో నమోదు ప్రక్రియ అనేది ఆదిలోనే హంసపాదులా మా రింది. దీనివల్ల కొద్దిమొత్తంలో పత్తి పండిన రైతులు, నాణ్యత లేదనుకున్న రైతులు స్థానికంగా ఉండే మధ్య దళారులకు అడ్డికి పావుశేరు లెక్కన విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటాల్‌కు 5వేల నుంచి 6వేలకు మించి ధర రావడం లేదు. ఇప్పటికే వర్షాలతో దెబ్బతిన్న పత్తి చాలా వరకు దళారుల పాలైం ది. ఇక మిగిలిన పత్తిని అమ్ముకుందామంటే సవాలక్ష సవాళ్లు తప్పడం లేదు.
గతంలో ఎకరా విస్తీర్ణం ఉన్న రైతు గరిష్టంగా 11.70 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉండేది. కానీ ఈ సీజన్లో దాన్ని ఏడు క్వింటాళ్లకే పరిమితం చేశారు. ఒక రైతు ఎకరం విస్తీర్ణంలో ఎంత పత్తి దిగుబడి వచ్చినా 7 క్వింటాళ్లనే అధికారులు కొంటారు. మిగతా పత్తిని బయట దళారులకు అమ్ముకోవాలని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.వాస్తవంగా ఎకరం విస్తీర్ణంలో సగటున 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది. సీసీఐ తాజా నిబంధనలతో మంచి దిగుబడి సాధించిన పత్తి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటేటా పం టల దిగుబడి పెంచాలంటూ ఓ వైపు చెబు తూనే మరోవైపు కొనుగోళ్ల విషయం వచ్చేసరి కి తగ్గించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో కాటన్ మిల్లుల్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను నోటిఫై చేస్తూ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అయితే అన్నిచోట్ల ఒకేసారి కొనుగోళ్లు జరపకుండా దశలవారీగా కొన్నింటిని మాత్రమే తెరిచి కొనుగోలు చేయాలని కొర్రీలు పెట్టారు. దీని వల్ల జిల్లాలో ఉన్న మిల్లుల్లో 20 శాతమే రైతులకు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే జిల్లాలో అన్ని కేంద్రాలు తెరిస్తేనే పత్తి కొనుగోళ్లు సజావుగా జరగడం లేదని నిత్యం పత్తి రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీసీఐ కేంద్రాలను ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5 కేటగిరీలుగా విభజించి ఒక కేటగిరీ పూర్తయిన తర్వాతే మరో కేటగిరీ మిల్లుల్లో కొనుగోలు జరపాలని ఆంక్షలు విధించారు. నల్లగొండ జిల్లాను పరిశీలిస్తే మొత్తం 23 సీసీఐ కేంద్రాలు ఉండగా వీటిని ఐదు కేటగిరీలుగా విభజించారు.
ఎల్1 కేటగిరీలో 8 కేంద్రాలు, ఎల్2లో ఏడు కేంద్రాలు, ఎల్3లో 4, ఎల్4లో రెండు, ఎల్5లో ఒక కేంద్రంగా విభజించారు. వీటిల్లో ముందుగా ఎల్1 కేంద్రాలను అందుబాటులో ఉంచి వీటి కొనుగోలు కెపాసిటీ పూర్తయ్యాక ఎల్2 కేంద్రాలు తెరవాలని ఆదేశించారు. దఫాల వారీగా ఏ కేంద్రాలైతే తెరుస్తారో అక్కడ మాత్రమే రైతులు పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ బుకింగ్స్‌కు అనుమతిస్తారు. మిగతా సీసీఐ కేంద్రాలను తాత్కాలికంగా పక్కన పెడతారు. దీంతో రైతులు పత్తి అమ్ముకోవడానికి దూరాభారంతోపాటు ఒకే కేంద్రంలో విధిలేని పరిస్థితుల్లో అమ్ముకోక తప్పదు. మరోవైపు కేంద్రాలు మూసీ ఉన్న ప్రాంతాల రైతులు రోజుల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తుంది. అందుకే ఈ విధానంపై తీవ్ర వ్యరేకత వ్యక్తమవుతోంది.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అనుసరిస్తున్న అసంబద్ధ, అనాలోచిత, రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ కాట న్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో పాటు రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో కొనుగోళ్లకు కొత్తగా కపాస్ కిసాన్ యాప్ పెట్టి అందులో రైతు లు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటేనే కొనుగోళ్ల చేయడం, ఒక ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని నిబంధన విధించడం, అదే విధంగా అన్ని సీసీఐ కేంద్రాలను ఒకే సారి కాకుండా విడతల వారీగా ఓపెన్ చేయాలనే అసంబద్ధ నిర్ణయాలతో కొనుగోళ్లల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులపై కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తుండటం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరుమెదపక పోవడంతో రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం స్పందిం చి సీసీఐ తీరును సరిదిద్ది పత్తి కొనుగోళ్లు కొనసాగేలా చూడాలని రైతులు, రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.