ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వరుసగా రెండో రోజు కూడా సీసీఐ కేంద్రాల వద్ద పత్తి రైతులకు పడిగాపులు తప్పలేదు. పత్తి కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యమన్నట్లుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన కఠిన నిబంధనలపై రైతులతోపాటు కాటన్ మిల్లు యాజమాన్యాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీసీఐ నిబంధనలపై స్పందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండటంతో కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ సోమవారం నుంచి కొనుగోళ్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మంగళవారం ఉమ్మడి జిల్లా అంతటా కొనుగోలు కేంద్రాల గేట్లు కూడా తెరుచుకోలేదు. రైతులు కేంద్రాల వద్దకు పత్తిని తెచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి నిబంధనలను సరళతరం చేస్తేనే కొనుగోళ్లు పున:ప్రారంభిస్తామని మిల్లర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పెద్దలు మంగళవారం దిగివచ్చి అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఎకరాకు గతంలో మాదిరిగానే 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామని, అన్ని కేంద్రాలను రెండు మూడు రోజుల్లో తెరుస్తామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలుపుతూ బుధవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్18 (నమస్తే తెలంగాణ) : పత్తి రైతుపై దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇన్నాళ్లు ప్రకృతి పగబట్టినట్లు వ్యవహరిస్తే ఇప్పుడు పాలకులు కత్తి కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని అమ్ముకుందామంటే మార్కెట్లో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కపాస్ కిసాన్ యాప్‌తో మొదలైన కష్టాలు తేమ శాతం 12 వరకే ఉండాలన్న నిబంధనలు, ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని కొంటామన్న షరతులు చివరగా స్థానికంగా ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎప్పుడు తెరుస్తారో చెప్పని దుస్థితి మధ్య ఈ సీజన్లో పత్తి రైతు తీవ్రంగా నలిగిపోతున్నాడు. వీటిన్నింటిపై సానుకులంగా స్పందించి, కొనుగోళ్లను సరళతరం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులంటే పట్టనట్లే వ్యవహరిస్తుండటం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు నత్తనడకను తలపిస్తున్నాయి. దీంతో సీసీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. ఈ నెల 6వ తేదీ నుంచి అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తితో తాత్కాలికంగా ఆందోళనను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఈ నెల 17వ తేదీ నుంచి తిరిగి తమ ఆం దోళనకు సిద్ధమై కొనుగోళ్లను నిలిపివేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాటన్ మిల్లుల్లోనే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వాహనాలపై పత్తిని తెచ్చిన రైతులు రెండురోజులు గా పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు పత్తిని లోడ్ చేసుకుని తెచ్చిన వాహనాల ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు సైతం రైతుల నెత్తిన అదనపు భారంగా మారాయి. ప్రభుత్వాల తీరుతో రైతులు రెండువిధాలుగా నష్టపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 7.81లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు అం చనా. ఇందులో నుంచి సాధారణంగా అయితే 95 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సి ఉంది. ఈ సీజన్లో అకాల వర్షాలతో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. వర్షాలతో చేలు నీరుచిచ్చుకు గురికావడమే కాకుండా ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలతో తడిసి ముద్దయింది. దీంతో ఓ వైపు దిగుబడిపై తీవ్ర ప్రభావం పడగా మరోవైపు అంతంత మాత్రంగా చేతికి వచ్చిన పత్తిలో సైతం నాణ్యత కొరవడింది. ఇదే సమయంలో అండగా నిలవాల్సిన సీసీఐ కం డిషన్లు పెట్టింది. దీంతో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క శాతం కొనుగోళ్లు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. నల్లగొండ జిల్లానే పరిశీలిస్తే ఇక్కడ 23 సీసీఐ కేంద్రాలను నోటిఫై చేశారు. అయితే ఇప్పటివరకు 18 కేంద్రాలను మాత్రమే తెరిచి కొనుగోళ్లు ప్రారంభించారు. వీటిల్లోనూ ఇప్పటివరకు 98492 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో ఐదు సీసీఐ కేంద్రాలను తెరవాల్సి ఉంది. జిల్లాలోని కేంద్రాలను ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్4, ఎల్5గా విభజించి దశలవారీగా వీటిని తెరుస్తూ వస్తున్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పాటు ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని కొనుగోళ్లకు అంగీకరిస్తామని షరతు విధించారు. గతంలో ఇది 12 క్వింటాళ్ల పరిమితి వరకే ఉంది. దీనిపైనా ఆంక్షలు పెట్టారు. ఇక కపాస్ కిసాన్ యాప్‌లో ఆధార్‌తో రైతు ముందే స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి కొంటామని నిబంధన పెట్టారు. వీటన్నింటీ నేపథ్యంలో ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి.
సీసీఐ అసంబద్ధ, అనాలోచిత, రైతు వ్యతిరేక విధానాలపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో పాటు రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ కొనుగోళ్లు నిలిపివేశారు. రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎకరాకు విధించిన పరిమితిని 7 క్వింటాళ్ల నుంచి గతంలో మాదిరిగానే 12 క్వింటాళ్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. జిల్లాల పరిధిల్లోని అన్ని సీసీఐ కేంద్రాలను రెండు మూడు రోజుల్లోనే ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో బుధవారం నుంచి తిరిగి యథావిధిగా పత్తి కొనుగోళ్లను పునప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇకనైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతులు, రైతుసంఘాల నేతలు కోరుతున్నారు.
చండూరు, నవంబర్ 18: చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డలో ఉన్న మంజీత్ పత్తి మిల్లులో మూడు రోజులుగా పత్తి కొనుగోలు జరగక పోవడంతో మిల్లు వద్దనే పడిగాపులు కాయాల్సివస్తోంది. మిల్లులో, మిల్లు బయట సుమారు 60 ట్రాక్టర్ల పత్తి లోడ్లు ఉన్నాయి. అకాల వర్షాలతో పత్తి తడిసి, నల్లగా మారడంతో పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు చేతికొచ్చిన పత్తిని అమ్ముకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పత్తి మిల్లు బయట ట్రాక్టర్లు పెట్టుకొని పడిగాపులు కాయాల్సి వస్తోంది.
నాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సకాలంలో కూలీలు దొరక్క చేనుపైనే పత్తి ఉండిపోయింది. అకాల వర్షాలకు పత్తి తడిసి నల్లగా మారింది. దానిలో కొంత మేర మంచి పత్తి చేతికి వచ్చింది. కూలీలకు పత్తి అమ్మి డబ్బులు చెల్లించాలి. మా వద్ద సీసీఐ లేకపోవడంతో ఆదివారం సాయంత్రం చండూరుకు పత్తి తీసుకరావల్సి వచ్చింది. కానీ ప్రభుత్వం రెండు రోజులవుతున్నా సీసీఐ ద్వారా పత్తి కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. దళారులకు అమ్ముదామంటే వారు ఇదే అదునుగా తక్కువ ధరకు అడుగుతున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
కట్టంగూర్, నవంబర్ 18: ప్రభుత్వం అనేక నిబంధనలు విధించడం వల్ల కాటన్ మిల్లు యజమానులు పత్తి కొనుగోలు చేయడం లేదు. పండించిన పత్తిని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 5 ఎకరాల్లో సాగు చేసి పత్తిని తీసి ఇంట్లో నిల్వ ఉంచా. వారం రోజులు క్రితం స్లాట్ బుక్ చేసుకున్నా. సీసీఐ కేంద్రానికి తీసుకొద్దామనుకుంటే కొనుగోళ్లు నిలిపివేశారు. పత్తి తీసినోళ్లకు కూలి డబ్బులు ఇవ్వాలన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వం తక్షణమే కాటన్ మిల్లుల యజమానులతో చర్చలు జరిపి గతేడాది మాదిరిగానే ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలి.
నకిరేకల్, నవంబర్ 18 : నా పేరు కందాల యాదగిరిరెడ్డి. నకిరేకల్ మండలం నోముల గ్రామం మాది. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేసిన. కేజీ రూ.18 నుంచి రూ. 20లు ఇచ్చి కూలి వాళ్లతో ఏరిచ్చిన. రోజూ కూలి వాళ్లకు రూ.400లతో పాటు ఆటో కిరాయి రూ.1500 అదనంగా ఇచ్చిన. పత్తి ఎకరానికి 7 క్వింటాల్ మాత్రమే తీసుకుంటామని అధికారులు చెబుతుర్రు. ఎకరానికి 9 క్వాంటాళ్ల పత్తి వచ్చింది. ఎకరానికి 2 క్వింటాళ్ల చొప్పున 4 ఎకరాలకు 8 క్వింటాళ్ల పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి. మద్దతు ధర రూ.8100 వస్తేనే అక్కడికక్కడికి పెట్టుబడులు ఎల్తయి. పైన ఉన్న 8 క్వింటాళ్లు దళారులకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.5,800 నుంచి 6000 వేలకు దళారులు కొంటున్నరు. అందులో మళ్లీ చెత్తాచెదారం పేరిట కేజీ, బస్తా తూకం కేజీ మొత్తం రెండు కేజీలు తరుగు తీస్తున్నరు. ఉన్న పత్తిని మొత్తం ప్రభుత్వమే కొనాలి.
కొండమల్లేపల్లి, నవంబర్ 18: సోమవారం పత్తిని సీసీఐ కేంద్రంలో అమ్ముకోవాలని యూప్‌లో స్లాట్ బుక్ చేసుకున్నా. మండంలోని శివ గణేశ్ కాటన్ మిల్లు వద్దకు పత్తిని తీసుకొని 60 కిలోమీటర్ల నుం చి వచ్చా. గంటలు గడుస్తున్నా ఎవరూ రాలేదు. మిల్లు సిబ్బందిని అడిగితే సీసీఐ బంద్ అని చెప్పా రు. ట్రాక్టర్ రూ.6 వేలు పెట్టి కిరాయికి తీసుకొచ్చా. లోడ్ చేసిన కూలీలకు మరో రూ.5 వేలు అయ్యా యి. తీరా ఇక్కడికొస్తే బంద్ అన్నారు. పొలం కౌలుకు తీసుకొని పుట్టెడు కష్టం చేసి ఇబ్బందులకోర్చి పత్తిని పండించి తీసుకొస్తే నరకం చూపిస్తున్నారు. సీసీఐ వాళ్లు పత్తిని కొనకపోతే ముందుగానే స్లాట్ బుక్ ఆపాలి. పండించిన పత్తిని అమ్ముకోలేక, ఇంట్లో నిల్వ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ట్రాక్టర్లో కవర్లు కప్పి ఉంచితే తేమ శాతం తగ్గుతుంది. అధికారులు వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి.