పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 18 : మండలంలోని పత్తి మిల్లులకు భారీగా పత్తి ట్రాక్టర్లు వచ్చాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో నిలిచిపోయిన కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దాంతో వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో పత్తి భారీగా వచ్చింది. దాంతో పత్తి ట్రాక్టర్లు బారులుదీరి కనిపించాయి. కొంత మంది రైతులు సెలవు రోజుల్లో పత్తి తేవడంతో మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండమల్లేపల్లి సీసీఐ పరిధిలో పీఏపల్లి, మల్లేపల్లి, డిండి మండలాలకు కలిపి ఐదు మిల్లులో పత్తి కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు 74 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగా మరో 70 వేల క్వింటాళ్లకు పైగా మిల్లుల వద్ద ట్రాక్టర్లు నిలిచి ఉన్నాయి.
సెలవు దినాలతోపాటు ప్రభుత్వం నుంచి సృష్టమైన అదేశాలు రాకపోవడంతో దాదాపు ప్రారంభించిన పది రోజుల వరకు కొనుగోలు చేయలేదు. దాంతో పత్తి భారీగా పేరుకుపోయింది. పీఏపల్లి మండలంలోని చిలకమర్రి మిల్లుల వద్ద సోమవారం వందలాది ట్రాక్టర్లు బారులుదీరాయి. ఇందులో చాలా వరకు తేమ పేరుతో తిరస్కరించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరికొంత మందికి రైతుల వద్ద ట్రాక్టరుకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు కోత విధించడంతో చేసేది లేక పత్తి విక్రయించుకుం టున్నారు. దీనికి తోడు కొన్ని మిల్లుల వద్ద దళారుల హవా కొనసాగుతున్నది. గ్రామాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, మిల్లుల వద్ద పట్టా పాస్‌పుస్తకాలు ఉన్న రైతుల పేర్ల మీద ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రోజుల తరబడి మిల్లు వద్ద ఉన్న రైతుల కంటే దళారుల పత్తి ముందుగా దిగుమతి కావడం విశేషం. గతంలో పత్తి మిల్లు వద్ద వేగంగా దిగుమతులు జరిగేవని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని రైతులు వాపోతున్నారు.
ఐదు రోజులుగా తిరుగుతున్నాం
నేను ఐదు రోజుల క్రితం 20 క్వింటాళ్ల పత్తిని మిల్లుకు తీసుకొచ్చిన. మొదటి రెండురోజులు మాశ్చర్ చూడలేదు. తర్వాత మూడు రోజులు సెలవులు రావడంతో ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ పత్తి అమ్ముకోవడానికి ఇంత ఇబ్బంది పడలేదు. ఒక పక్క ట్రాక్టర్ కిరాయి పడుతున్నది. ఇయ్యాల కొంటరేమోనని ఎదురు చూస్తున్నాం.
– కేతావత్ బాలు ,సాగర్
పత్తి కొనుగొలు వేగవంతం చేస్తున్నాం
కొండమల్లేపల్లి సీసీఐ కేంద్రం పరిధిలో 5 మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నాం. వరుసగా సెలవులు రావడంతోవ కొంత పత్తి భారీగా నిలిచింది. దీంతో సోమవారం ఒక్క రోజే 4 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాం. తేమ పేరుతో కోతలు లేకుండా చూస్తాం. దళారులు వచ్చినా మేము భూమి ఉన్న రైతు ఫొటో బయోమెట్రిక్ తీసుకొని వారి ఖాతాలోనే డబ్బులు వేస్తాం.
– కిరణ్, సీసీఐ అధికారి