రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడి అవుతున్నాయి. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం టాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, అన్నీ సక్రమంగా ఉన్నా భూ యజమానులకు తీరని అన్యాయం చేయడం.. వివాదాల్లో ఉన్న భూములు కొలిక్కి రాకముందే పెద్దమొత్తంలో తీసుకొని వేరొకరికి కట్టబెట్టడం వంటివి ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల కిందట అక్రమాలకు పాల్పడిన అప్పటి హుజూర్నగర్ తాసీల్దార్ వజ్రాల జయశ్రీని సస్పెండ్ చేయడంతో జైలుకు కూడా వెళ్లారు. కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్‌ను అధికారులు టెర్మినేట్ను చేశారు.
కోదాడలో తాసీల్దార్ సాయిగౌడ్ బదిలీ అయ్యారు. ఆర్ఐ సుజిత్‌ను సస్పెండ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ వెంకయ్యను టెర్మినేట్ చేశారు. మోతెలో తాసీల్దార్ సంఘమిత్ర సస్పెండ్ అవడంతోపాటు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆర్ఐలు నిర్మల, మన్సూర్ అలీతోపాటు, గతంలో పని చేసిన మరో ఆర్ఐ అజయ్, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు సస్పెండ్ అయ్యారు.
తాజాగా ఆత్మకూర్.ఎస్ మండలంలో నకిలీ పత్రాలు సృష్టించి రూ.5కోట్ల విలువైన భూమిని ఒకరికి కట్టబెట్టగా ఇందులో తాసీల్దారు కార్యాలయంతో పాటు ఓ డివిజనల్ స్థాయి అధికారి పాత్ర కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేసి కథను ముగించడం గమనార్హం. కోర్టు పరిధిలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘనులు చివ్వెంల మండలంలో ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల రెవెన్యూ శాఖలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతుండగా బయటపడితే సస్పెన్షన్, శాఖాపరమైన చర్యలు.. లేదంటే జేబులు నింపుకోవడం సహజంగా మారింది.
గత ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలతో చాలావరకు కట్టడి అయింది. తిరిగి ఇప్పుడు మళ్లీ అక్రమార్కులు అవకాశం ఉన్న మేరకు అవినీతికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మోతె మండలంలో పెద్దఎత్తున రికార్డుల టాంపరింగ్‌కు పాల్పడి లక్షలాది రూపాయలు తీసుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినందుకు గాను తాసీల్దార్, ఇద్దరు ఆర్ఐలు, కంప్యూటర్ ఆపరేటర్‌పై కేసులు నమోదవయ్యాయి. కొందరు జైలుకు కూడా వెళ్లారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడినందుకు అంతకుముందు హుజూర్నగర్, కోదాడలోనూ రెవెన్యూ అధికారులపై వేటు పడింది.
ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్‌లో ఓ భూమికి సంబంధించి తాసీల్దారు కార్యాలయం నుంచి నెలల వ్యవధిలోనే మూడు తీర్లుగా వేర్వేరు రిపోర్టులు ఇవ్వడం, నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. ఇందులో తాసీల్దార్ కార్యాలయం అధికారులతోపాటు సూర్యాపేట ఆర్డీఓ పాత్ర కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి సస్పెన్షన్లూ లేకపోగా కేవలం డిప్యూటీ తాసీల్దారును కలెక్టరేట్‌కు బదిలీ చేసి కథను ముగించారని వాపోతున్నారు.
నెమ్మికల్‌లోని సర్వే నెంబర్ 75లో నిమ్మల భారతమ్మకు ఐదెకరాల భూమి ఉండగా, చాలాకాలంగా అది ప్రొహిబిటెడ్ జాబితాలో పడింది. మరోపక్క అధికారులు సదరు భూమిపై భారతమ్మ కబ్జాలో ఉన్నారని, సాగు చేస్తున్నారని రిపోర్ట్ ఇచ్చారు. మరోసారి అదే భూమిపై సంధ్య అనే మరో మహిళ కబ్జాలో ఉన్నట్లు ఇంకొక రిపోర్ట్ కూడా ఇవ్వడంతో జిల్లా కలెక్టర్‌కు భారతమ్మ ఫిర్యాదు చేశారు. విచారణకు కలెక్టర్ ఆదేశించడంతో ఆ భూమిపై ఎవరికీ సరైన పత్రాలు లేవంటూ మరొక రిపోర్ట్ ఇచ్చారు.
భారతమ్మకు పాస్‌పుస్తకం ఉండడం, పహానీల్లో పేరు ఉండడం, కబ్జాలో కూడా ఉండగా మూడు రిపోర్టులు ఇచ్చిన అదే అధికారులు ఆరు నెలల క్రితం నకిలీ పత్రాలు సృష్టించి సంధ్యకు రిజిస్ట్రేషన్ చేశారని భారతమ్మ ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం తతంగంలో దాదాపు రూ.40లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో డిప్యూటీ తాసీల్దార్, ఓ డివిజనల్ స్థాయి అధికారితోపాటు మరికొంతమంది అధికారులు, ఉద్యోగుల పాత్ర ఉందని భారతమ్మ ఆరోపణలు చేస్తున్నారు.
కాగా, ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ద్వారానే ఉన్నతాధికారులు రిపోర్ట్లు తెప్పించుకుంటుండడం గమనార్హం. ఇలా అయితే తమకు న్యాయం ఎలా జరుగుతుందని భారతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమాలకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంతోపాటు తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబును నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఆర్డీఓ ద్వారా రికార్డులు, రిపోర్ట్ మాత్రమే తెప్పించుకోవడం జరిగిందని తెలిపారు.