మిర్యాలగూడ, ఏప్రిల్ 10 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర్‌రాజు పరిశీలించి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించగా కొంతమంది అనుమానిత వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని 57 బైక్‌లు, 4 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పలు వాహనాల నంబర్లు ట్యాంపరింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ వాహనాల ద్వారా ఎక్కడైనా నేరాలకు పాల్పడ్డారా, లేక వాహనాలు ఎక్కడ నుంచి వచ్చాయి అనే విషయాలు పూర్తి దర్యాప్తు అనంతరం వెల్లడి అవుతుందన్నారు. ఇకనుంచి కార్డెన్ సెర్చ్ నిరంతరం కొనసాగనున్నట్లు చెప్పారు. ప్రజలు అనుమానిత వ్యక్తులు కనిపించినా, ఎవరైనా వాహనాలపై అతివేగంగా సంచరిస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నా అటువంటి వారి ఆచూకీ పోలీసులకు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు పీఎన్డీ ప్రసాద్, మోతీరాం, సోమ నరసయ్య, 12 మంది ఎస్ఐలు, 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.