హాలియా, మే 9 : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవల పరిస్థితి దయనీయంగా ఉంది. హాలియాలో పేరుకే 24 గంటల దవాఖాన ఉన్నది. ఇక్కడ ఒక్కరే డాక్టర్. ఆయన మొదటి షిఫ్ట్‌లో పనిచేస్తారు. రెండు, మూడు షిఫ్ట్‌లలో పనిచేసేందుకు వైద్యులు లేరు. సాయంత్రమైతే డాక్టర్ అందుబాటులో ఉండరు. అలాగే దవాఖానలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ పట్టించుకునే వారే లేరు.
పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షే..
హాలియాలో 30 పడకల దవాఖాన నిర్మాణం పూర్తి చేసిన కాంట్రాక్టర్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేసి రెండు నెలలు దాటినా ప్రారంభించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమయం దొరకడం లేదు.
3.5 కోట్ల విడుదల చేసిన కేసీఆర్..
హాలియా చుట్టుపక్క ప్రాంత ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ హాలియాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకు కావాల్సిన రూ.3.5 కోట్లు కూడా విడుదల చేశారు. అలాగే పోస్టుమార్టం గదిని కూడా మంజూరు చేశారు. కాంట్రాక్టర్ దవాఖాన నిర్మాణం పూర్తి చేసి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కొరుతున్నా ఎమ్మెల్యే ప్రారంభించనిదే తాము చేసుకోలేమంటూ వెనకడుగు వేస్తున్నారు.
పేరుకే 24గంటల దవాఖాన..
ప్రస్తుతం హాలియాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకే 24 గంటల దవాఖాన. కానీ వైద్య సేవలు మాత్రం పగటి పూటకే పరిమితం. దవాఖానలో ఒక్క స్టాఫ్ నర్సు పోస్టు, పార్మాసిస్టు పోస్టు , ఒక సూపర్వైజర్ పోస్టు ఖాళీగా ఉంది. మండలంలో మొత్తం 12 సబ్ సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్‌కు ముగ్గురు ఏఎన్ఎంలతో కలిపి మొత్తం 36 మంది ఏఎన్ఎంలు ఉండాలి. కానీ కేవలం 13 మందే ఉన్నారు. 8 మంది హెల్త్ అసిస్టెంట్లకు గాను నలుగురే ఉన్నారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలు, గిరిజనులు, పర్యాటకుల వైద్యసేవలను దృష్టిలో పెట్టుకొని రూ.18 కోట్లతో కమలానెహ్రూ దవాఖానను ఆధునీకరించారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కృషితో డయాలసిస్ సెంటర్ మంజూరు చేశారు.
వెంటనే ప్రారంభించాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వం హాలియాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేసింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కృషి వల్ల అదనపు గదుల నిర్మాణం కోసం రూ. 3.5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. భవన నిర్మాణం పూర్తయింది కానీ ప్రారంభించేందుకు ప్రజా ప్రతినిధులకు సమయం లేకపోవడం బాధాకరం.
-సురభి రాంబాబు, హాలియా
త్వరలోనే ప్రారంభోత్సవం
30 పడకల దవాఖాన భవన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. త్వరలో ఎమ్మెల్యే, ఎంపీ, ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రారంభించే అవకాశం ఉంది.
– రామకృష్ణ, మండల వైద్యాధికారి, అనుముల