Telangana Government | తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలో సినిమాల టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూనే, ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు రాబడిలో నిర్దిష్ట మొత్తాన్ని చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సరిగ్గా 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) నిర్వహించే ప్రత్యేక సంక్షేమ విరాళంగా తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను చిత్ర నిర్మాణ సంస్థలకే అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అదనపు ఆదాయంపై వర్తించే ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి నేరుగా నిర్మాతలే వసూలు చేయాలి. ఆ విధంగా వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాకు లేదా TGFDC ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల వచ్చిన ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, అలాగే ‘పెద్ది’ సినిమాలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినివ్వగా ఈ సినిమాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్ఎల్పి, మరియు వృద్ధి సినిమాస్ ఎల్ఎల్పిలకు రాష్ట్ర హోం శాఖ ప్రత్యేకంగా లేఖలు పంపింది. టికెట్ ధరల పెంపు ద్వారా సమకూరే అదనపు రాబడిలో 20% మొత్తాన్ని సంక్షేమ నిధికి మళ్లించే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని, తదనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా నిర్మాతలను ప్రభుత్వం ఆదేశించింది.