నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), ఏప్రిల్ 10 : తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురువారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, పోస్టర్లను పట్టుకుని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీసీ చాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి యూనివర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 21 రద్దుచేసి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించి రెగ్యులర్ చేయాలని కోరారు.
హైదరాబాద్లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వద్దకు వెళ్లిన యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తరగతులు బహిష్కరించి కాంట్రాక్ట్ అధ్యాపకులు బంద్ పాటించారు. న్యాయమైన సమస్యల కోసం అధ్యాపకులు చేపట్టిన బంద్కు విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతుల నుంచి బయటకు వచ్చి బంద్కు మద్దతు ప్రకటించారు.
ఎంజీయూ విసి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ను కాంట్రాక్ట్ అధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం జీఓ 21 విడుదల చేసి తమకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తమ వంతుగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ చింతా శ్యామ్ సుందర్, డాక్టర్ చిలుకూరి రమేశ్, డాక్టర్ ఎన్.భిక్షమయ్య, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ వై.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మశ్చీంద్ర, డాక్టర్ అమరేందర్, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ స్వప్న, జ్యోతి, మౌనిక, సమరీన్, అభిలాష పాల్గొన్నారు.