మిర్యాలగూడ, ఏప్రిల్ 8: గత రెండు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరసిస్తూ స్థానిక సబ్ స్టేషన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ధర్నాకు సీఐటీయూ, విద్యుత్ కార్మిక సంస్థల(2117 )యూనియన్, టీఆర్యూఎస్కే జూనియర్ (327) యూనియన్లు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మల్లేష్, గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 23 వేలకు పైగా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పటివరకు వారిని రెగ్యులర్ చేయలేదన్నారు. 23 వేల మందిలో ఇప్పటికే కొంతమంది చనిపోగా మరికొందరు ఉద్యోగ విరమణ చేశారన్నారు. మిగిలిన 18వేల మందికి ఇప్పటికీ రెగ్యులర్ చేయకపోవడం విచారకరమన్నారు. వీరిలో అత్యధికులు ఐటీఐ చేసిన వారు, ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారని, అలాంటి వారిని రెగ్యులర్ చేయకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో వివిధ యూనియన్ల నాయకులు రాము, ఆదిరెడ్డి, సైదులు, రాజేశ్వర్, ఫసియొద్దీన్, రవినాయక్, మంగారెడ్డి, పరుశు రాములు పాల్గొన్నారు.
అందరికీ ఒకే నిబంధన వర్తింపజేయాలి
ఒకే సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఒకే రకమైన సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని, విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్, ఆన్మ్యాన్డ్, స్పాట్ బిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శి హతీరాం నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మండల కేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట వారు నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్టిజన్ల కన్వర్షనపై ఎనిమిదేళ్లుగా కొట్లాడుతున్నామని అన్నారు. చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, ఆన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఏపీఎస్ఈబీ నిబంధనలు అమలు చేయడంతో పాటు గృహజ్యోతి పథకం ద్వారా బిల్లింగ్ కార్మికులను ఆదుకోవాలని, పీస్ రేట్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీవీఏఈజెఏసీ జిల్లా జాయింట్ కన్వీనర్ దాసరి యాదయ్య, రమేష్‌రెడ్డి, పగిళ్ల యాదయ్య, పంతంగి శంకర్, రమావత్ పుల్యా, తిరుపతి కుమార్, సర్వర్ హుస్సేన్, జనార్దన్‌గౌడ్, దస్రూ నాయక్, ముని, శ్రీనునాయక్ పాల్గొన్నారు.