నల్లగొండ, అక్టోబర్ 23 : రామన్నపేటలో అదానీ గ్రూప్ చేపడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లా డారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రామన్నపేటలో నిర్వహించిన ప్రజాభిప్రాయానికి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. దానికి మాజీ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని ఎందుకు హాజరుకానివ్వకుండా పోలీసులతో అరెస్ట్ చేయించటంలో కుట్ర ఏందో చెప్పాలన్నారు. ఇక్కడి వనరులు దోచిపెట్టడానికే ముందస్తుగా సీఎం రేవంత్‌కు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అదానీ వంద కోట్ల రూపాయిలు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టడంలో అంతర్యమేమిటి? : ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
దామరచర్ల లాంటి ప్రాంతాల్లో రా మెటీరియల్ ఉండటంతోపాటు పక్కనే కృష్టానది ప్రవహిస్తున్నందున అక్కడ అనేక సిమెంట్ ఫ్యాక్టరీ వెలిశాయని, రామన్నపేటలో రా మెటీరియల్ లేకపోగా నీటి లభ్యత కూడా లేదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ఇక్కడ అదానీ గ్రూప్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణలో రామన్నపేట మండల వాసులకు ఐడీ కార్డులు ఇచ్చి నిర్బంధంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సిన అవసరం ఏమిటని తెలిపారు. అక్కడికి తాను తప్ప ఏ ఒక్క ప్రజాప్రతిని కూడా రాలేదని, మాజీ ఎమ్మెల్యేలను రాకుండా నిర్బంధించారని మండిపడ్డారు.
పోలీసు పహారాలో ప్రజాభిప్రాయ సేకరణపెట్టడం ఎందుకు? : చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే, నకిరేకల్
నకిరేకల్ నియోజక వర్గంలోని రామన్నపేటలో డ్రైపోర్ట్ పెడతామని గతంలో 300ఎకరాలు సేకరించి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతామంటున్నారని, 12 గ్రామాల్లో పచ్చని పంట పొలాలను నాశనం చేస్తామంటే ఉపేక్షించేది లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఓ వైపు చిట్యాల ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీల వల్ల నీరు కలుషితం అవుతుండగా, మరో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చి ఆ వ్యర్థాలను ఎక్కడ పోస్తారని ప్రశ్నించారు. ప్రజల మధ్య పెట్టాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ పోలీసుల మధ్య పెట్టడం ఎందుకని, అలాంటిది సీఎం ఆఫీసులోనే పెట్టుకుంటే సరిపోతది కదా విమర్శించారు. అదానీకి ఫ్యాక్టరీ ఇస్తే మోదీ ఓటుకు నోటు కేసులో రక్షిస్తాడని రేవంత్ ఇక్కడి వనరులు దోచి పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
జిల్లా ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పాలి : కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ
డ్రైపోర్ట్ పేరుతో నాడు భూసేకరణ చేసి ఇప్పుడు రేవంత్‌ను అడ్డం పెట్టుకొని సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ప్రజల నోట్లో దుమ్ము కొట్టే ప్రయత్నం అదానీ చేస్తున్నాడని, దీనిపై కోమటిరెడ్డి బ్రదర్స్ తమ వైఖరి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మోదీ కనుసన్నల్లో అదానీ హైదరాబాద్‌ను కబ్జా చేసేందుకు వస్తుంటే రేవంత్ స్వాగతం పలుకుతున్నాడని విమర్శించారు. సంస్కారం లేని కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డగోలుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేయటం కాదని, ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీతో నల్లగొండ ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పాలన్నారు.
ఎవరి డైరెక్షన్లో అడ్డుకుంటున్నారు : గాదరి కిశోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, తుంగతుర్తి
సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని తాము ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడానికి వెళ్తుంటే పోలీసులు ఎవరి డైరెక్షన్లో అడ్డుకుంటున్నారో రాచకొండ సీపీ సమాధానం చెప్పాలన్నారు. రూ.1.50లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి, 12లక్షల చెట్లు కొట్టి నాశనం చేయడం, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీతో ధర్మారెడ్డి కాల్వలో వ్యర్థాలు పోయడం నాశనం కాదా అని ప్రశ్నించారు. మూసీనీ కాదు, ముందు సీఎం, మంత్రుల మూతులు ప్రక్షాళన చేసుకోండని విమర్శించారు. దేశంలో ఏ రాష్ర్టానికి, కనీసం సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు కూడా రూపాయి ఇవ్వని అదానీ సీఎం రేవంత్‌కు రూ.100 కోట్లు స్కిల్ డెవల్మెంట్ పేరుమీద, మరో రూ.వెయ్యి కోట్లు వారి అధిష్టానానికి ఇవ్వడానికి కారణం ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులను అప్పజెప్పేందుకేనని దుయ్య బట్టారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఎవరూ, ఏ వర్గం సమర్థించడం లేదన్నారు.
అధికారం మారినప్పుడల్లా అదే పార్టీలో ఉండే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనకొడుకుకు పనికిరాని పదవి కోసం పార్టీ మారి నీతులు వల్లిస్తున్నట్లు విమర్శించారు. అతి తెలివి తనకు ఉందని అనుకునే ఆయన ఒకరకమైన రాజకీయ వ్యభిచారి అని ఈ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం గుత్తాకు తెల్వదా, దానిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు చీకటి ఒప్పందాలతో ముందుకు సాగుతున్నాయని, వాటికి కళ్లెం వేయాలంటే అది బీఆర్ఎస్ వల్లనే అవుతుదని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చెరుకు సుధాకర్ గౌడ్, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, మారగోని గణేశ్, జమాల్ ఖాద్రి, మాలె శరణ్యారెడ్డి, మెరుగు గోపీనాథ్, దేప వెంకట్ రెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, కోండ్ర స్వరూప, బొమ్మరబోయిన నాగార్జున పాల్గొన్నారు.