మునుగోడు, ఆగస్టు 19 : మునుగోడు నుండి చిట్యాలకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి వద్ద నుండి మడేలయ్యా గుడి వెనుక భాగం నుండి చౌటుప్పల ప్రధాన రహదారికి బైపాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా మునుగోడు మండల కేంద్రంలోని వార్డులోని ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పలు వీధుల్లో మురికి కాల్వల నిర్మాణం లేకపోవడంతో మురికి నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నట్లు చెప్పారు. రజక కాలనీలో, చండూరు రోడ్డులోని చిక్కుల నరసింహ ఇంటి నుండి లక్ష్మీదేవిగూడెం వరకు సీసీ రోడ్డుతో పాటు రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
రజక కాలనీతో పాటు రెండో వార్డులో కృష్ణా జలాలు రాక తాగునీటి కోసం కాలనీ వాసులు అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. పేర్కొన్నారు. నల్లగొండ నుండి చౌటుప్పల్ కు వెళ్లే రహదారి , మునుగోడు నుండి చండూరుకు వెళ్లే నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నట్లు దుయ్యబట్టారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాలనీలలో వారానికోసారి దోమల మందు పిచికారి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను, పాలకూరి రాజు, పాలకూరి సాయమ్మ, రెవెల్లి సైదులు, రెవెల్లి సత్యనారాయణ, రెవెల్లి అనిల్ పాల్గొన్నారు.