ముంబై, ఫిబ్రవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో మదుపరుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. దీంతో వరుసగా రెండోరోజు సూచీలు భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, వాహన, ఆర్థిక రంగ సూచీల నుంచి లభించిన మద్దతుతోకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది.
లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 83 వేల మార్క్‌ను అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 479.95 పాయింట్లు అందుకొని 83,294.66 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 141.75 పాయింట్లు ఎగబాకి 25,713 వద్దకు చేరుకన్నది.
ఐటీ రంగ షేర్ల పతనం కొనసాగుతున్నది. ఏఐతో కంపెనీల ఆదాయ-లాభాలపై ప్రభావం చూపనున్నదన్న భయాలు ఐటీ రంగ షేర్లపై స్పష్టం కనిపిస్తున్నది. దీంతో సోమవారం కూడా ఈరంగ షేర్లు రెండు శాతం వరకు కోల్పోయాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ షేరు 1.80 శాతం నష్టపోగా, టెక్ మహీంద్రా 1 శాతం,హెచ్‌సీఎల్, టీసీఎస్ షేర్లు నష్టాన్ని మూటగట్టుకున్నాయి.