నల్లగొండ ప్రతినిధి/ సూర్యాపేట, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : ప్రజా పోరాటాలు, ఉద్యమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వర్గం ఏ పిలుపునిచ్చినా వెంటనే పోలీసులను రంగంలోకి దింపి నిర్బంధకాండకు పాల్పడుతున్నది. ప్రజాస్వామ్య పాలన అంటూ గొప్పులు చెప్తూ ఆచరణలో మాత్రం ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నది. సమస్యల పరిష్కారం కోసం కొంతకాలంగా ఆందోళన చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా, పోలీసుల ద్వా రా అడ్డుకున్నది. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు, మల్టీపర్పస్ విధానం రద్దు వంటి డిమాండ్లతో మంగళవారం ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అసెంబ్లీ ముట్టడికి సన్నద్ధమవగా, మంగళవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు ఎక్కడికక్కడ ముం దస్తు అరెస్టులు చేశారు.
నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, త్రిపురారం, పెద్దవూర, మునుగోడు, నార్కట్పల్లి, కేతేపల్లి, చండూరు ఇలా దాదాపు అన్ని మండలాల్లోనూ అరెస్టుల పర్వం సాగింది. పోలీసుల చర్యలను ముందే ఊహించి పలు మండలాల నుంచి సోమవారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నవారూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున 3 గంటల నుంచే పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగించారు. దాంతో సూర్యాపేట రూరల్, గరిడేపల్లి, మోతె, పెన్పహాడ్, అర్వపల్లి, తుంగతుర్తి తదితర పోలీస్ స్టేషన్లన్నీ పంచాయతీ కార్మికులతో నిండిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగానూ అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. గ్రామ పం చాయతీ పోలీస్ స్టేషన్ల ఎదుటే నిరసన తెలిపారు.
ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్మికుల పట్ల ప్రభు త్వ తీరు ను ఆ సంఘం నేతలు తీవ్రంగా ఖం డించా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు నెలకు రూ.1,500 వేతనాన్ని రూ.9 వేలకు పెంచడంతోపాటు ప్రతి నెలా పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చే నిధుల్లో తొలి దఫాగా వేతనాలు తీసుకోమని సూచించిందని, ఆ దిశ గా కార్మికులు ప్రతి నెలా వేతనాలు పొందేవారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పల్లెలకు నిధు లు లేవని, కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. అనేక ఇబ్బందుల నడు మ వెట్టి చాకి రీ చేస్తున్న పంచాయతీ కార్మికులకు సకాలం లో వేతనాలు చెల్లించడంతోపా టు ఇతర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. సర్కారు సమస్యలు పరిష్కరించే వర కు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.