అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేవబోతున్నది. రేపటి నుంచి నామినేషన్ల దాఖలు కానున్నాయి. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఆర్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలోనే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్ని చోట్లా ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలు కానున్నది. ప్రభుత్వ పనిదినాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్నది.
ఈ నెల 10వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. ఈ ఎన్నికల్లో ఆది నుంచి దూకుడు మీద ఉన్న బీఆర్ఎస్ నెల రోజుల కిందటే అభ్యర్థులను ప్రకటించి, బీ-ఫామ్ సైతం అందజేసింది. కానీ నేటికీ ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలోనే తర్జనభర్జన పడుతున్నాయి. అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు, తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునే క్రమంలో ఆయా పార్టీల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తున్నది.