సూర్యాపేట, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ) : గ్రామీణ ప్రాంత రోడ్లను బడా బాబులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కొరియా నుంచి వచ్చిన మంత్రి పొంగులేటి అన్నట్టుగానే మొదటి బాంబును గ్రామీణ ప్రజల గుండెల్లో పేల్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు విధానాలే పాటిస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ఆదివారం సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం అందిందన్నారు. 60 ఏండ్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి కేవలం పదేండ్లలో అద్భుత ప్రగతి సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారిపై బాంబులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోమారు తన విషబుద్ధిని ప్రదర్శించిందన్నారు. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం గ్రామీణ ప్రాంత రోడ్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెడితే ప్రజలపై మరింత భారం మోపినట్లు అవుతుందని, ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు. రాష్ర్టాన్ని దోచి బడా బాబులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను అడుగడుగునా ఎండగడుతామన్నారు. ప్రజల బతుకుల్లో చీకట్లు నింపే దుర్మార్గపు ఆలోచన చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి అద్భుతంగా రోడ్లు వేయడాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే మూసీ దోపిడీ కుట్ర జరిగిందని, ఇప్పుడు రోడ్లపై పడ్డారని, ఆ తర్వాత విద్యుత్‌ను కూడా కార్పొరేట్ల చేతుల్లో పెడతారని దుయ్యబట్టారు. రాష్ట్రం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తుందని, మున్ముందు ప్రపంచ బ్యాంక్‌కు అప్పగిస్తారేమనని ఎద్దేవా చేశారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్తే టాక్స్ కట్టాల్సిన దుస్థితిని తీసుకువస్తున్నదని, రోడ్లను ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో పూర్తి వివరాలు వెల్లడించాలని నిలదీశారు. ఇదే విధానం కొనసాగితే ఒక్కో జిల్లా ఒక కాంట్రాక్టర్ చేతుల్లోకి వెళ్తుందని, దీనిని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టంచ చేశారు.