జిల్లాలో అత్యాచార యత్నాల పర్వం కొనసాగుతున్నది. ఇటీవల చోటుచేసుకుంటున్న లైంగిక దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల తెలిసిన వారే నమ్మబలికి అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో భయాందోళన పెరిగిపోతున్నది. వరుసగా ఎక్కడో ఒక చోట అకృత్యం వెలుగు చూస్తుండటం కలవరపెడుతున్నది. ఈ విషయంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో కొందరు కీచకులు రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడుతున్నరు. ఆడుకునే వయసు బాలికలపైనా నీచ పనులకు ఒడిగడుతున్నారు. తమకూ తల్లి, చెల్లి, భార్య ఉందని మరిచి మనుషులుగా కాకుండా మృగాళ్లుగా మారుతున్నారు. తమను ఎవరూ పట్టుకోరన్న ధైర్యంతో ఎంతో మంది నేరాలకు పాల్పడుతూ తమ లైంగిక వాంఛను తీర్చుకునేందుకు ఇలా అమానుష ఘటనలకు పాల్పడుతున్నారు. యాదాద్రి జిల్లాలో లైంగిక దాడులు, అత్యాచార కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. గణాంకాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది 30కి పైగా అత్యాచార కేసులు, 132 వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఇక 41 పోక్సో కేసులు ఫైల్ కావడం గమనార్హం. ఇవి బయటకు రావడంతో కేసులు నమోదు చేసిన ఘటనలు మాత్రమే. ఇంకా బయటకు రాని ఉదంతాలు కూడా ఉన్నాయి.
మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అత్యాచారాలు పెరుగడానికి కుటుంబం, సమాజం, ప్రభుత్వ నిర్లక్ష్యాలే అసలు కారణమని, ఇవి బాధ్యత తీసుకుంటే లైంగిక దాడులు తగ్గే అవకాశం ఉందని గతంలో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన సర్వే సందర్భంగా తెలిపింది. పెరుగుతున్న టెక్నాలజీతో కొత్త కొత్త పోర్న్ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండటంతో విచ్చలవిడిగా అశ్లీల వీడియోలను చూస్తే సెక్స్‌కు ప్రేరేపితులవుతున్నారు. వీటికి తోడు మద్యపానం, డ్రగ్స్‌కు బానిసలై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల విచారణలోనూ ఇవే విషయాలు వెల్లడవుతున్నాయి.
బాలికలు, మహిళా సంరక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇలాంటి ఉదంతాలు ఆగడంలేదు. పోక్సో, నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా నేరాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. పోక్సో చట్టానికి సవరణలు కూడా చేశారు. దీని ప్రకారం 12 ఏండ్లలోపు చిన్నారులను అత్యాచారం చేసి, హత్య చేస్తే.. ఉరి శిక్ష తప్పదు. చట్టాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ తరహా నేరాలు పెరుగడానికి కారణమని పలువురు పేర్కొంటున్నారు. కొంత మంది తెలిసి కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండటం దౌర్భాగ్యంగా చెప్పవచ్చు. ప్రభుత్వాలు చట్టాలు తెస్తున్నప్పటికీ సక్రమంగా అమలు చేయడంలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేసులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో నేరస్తులకు భయం లేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తప్పు చేసిన వాడు ఎవరైనా, ఎంతటి ఉన్నత కుటుంబానికి చెందిన వాడైనా కఠిన శిక్ష పడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేరం జరిగిన కొన్ని ఏండ్ల తర్వాత శిక్ష వేసే పద్ధతికి స్వస్తి పలకాలని కోరుతున్నారు. త్వరితగతిన శిక్షలతో రేప్ చేయాలంటేనే భయపడేలా ఉండాలి. ఏ వ్యక్తి తప్పు చేయకుండా ఉండటానికి సమాజం అప్రమత్తం కావాలి. అందుకు తగిన పరిస్థితులను కల్పించాలి. దీనికి కుటుంబాలు, సమాజం, ప్రభుత్వం బాధ్యత వహించాలి. మహిళలు, బాలికలపై జరిగే దాడులపై అప్రమత్తం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి. అప్పుడే స్త్రీని దేవతగా పూజించిన నేలపై స్త్రీ జాతి ధైర్యంగా మనగలుగుతుంది.
తాజాగా ఆత్మకూరు (ఎం) మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
భువనగిరి పట్టణంలో బాలల దినోత్సవం రోజే బాలసదన్‌లో పదేండ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు.
భువనగిరి మండలంలోని ఓ గ్రామంలో మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ టీచర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి వేధించాడు.
చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో గంజాయి మత్తులో ఓ వివాహితపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.
గుండాలలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారి మైనర్ విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
భూదాన్ పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఫోక్సో కేసులు నమోదు చేశారు.
గత మూడు నెలల్లో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లలో మూడు పోక్సో కేసులు నమోదయ్యాయి.