సూర్యాపేట, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్లుగా కాళేశ్వరం కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీలు ఆడుతున్న నాటకాలను పటాపంచలు చేసేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చలో కన్నెపల్లి కార్యక్రమం చేపట్టినట్లు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పంటలను ఎండబెట్టి కావాలనే గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారన్నారు. రైతులు వెళ్లి చూస్తే తమ కుట్రలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే కన్నెపల్లి వెళ్లకుండా ఎక్కడికక్కడ నిర్బంధ కాండ కొనసాగించి కాంగ్రెస్ తన దమన నీతిని ప్రదర్శించిందన్నారు. అయినప్పటికీ సంకెళ్లను తెంచుకొని ముందుకు సాగి కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ సమాజానికి చూపించామన్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేట నుంచి పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి జగదీశ్‌రెడ్డి కన్నెపల్లికి బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ రైతాంగానికి దగ్గరయ్యారో, దానిని దూరం చేయాలనే కుట్రతో రెండున్నరేండ్లుగా అనేక ప్రాజెక్టులను ఎండబెట్టి, ప్రాజెక్టు కూలిందంటూ విష ప్రచారం చేస్తూ కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం నేడు తేటతెల్లమైందన్నారు. ఢిల్లీలోని బడే భాయ్ రాష్ట్రంలోని చోటే భాయ్ ఇద్దరూ కలిసి అటు దేశాన్ని ఇటు రాష్ర్టాన్ని నాశనం చేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం.. ఎల్లంపల్లి మొదలుకొని మిడ్‌మానేరు, మల్లన్న సాగర్, రంగన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్లతో పాటు వరంగల్ జిల్లాలోని మేడారం, బయ్యన్నవాగు, సూర్యాపేట జిల్లాలోని 450 కిలోమీటర్ల దూరంలోని చివరి చెరువు అయిన పెన్‌పహాడ్ మండలం చిన్నసీతారం తండా పరిధిలోని రావి చెరువు జలకళతో ఉట్టిపడేవన్నారు. రేవంత్‌రెడ్డి బాగోతాన్ని సమాజానికి కళ్లకు కట్టినట్లు చూపించేలా కేటీఆర్ పర్యటన కొనసాగిందన్నారు.