నార్కట్‌పల్లి మే 23 : ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకోవడాన్ని ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నదని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. శుక్రవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమాశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగలేదని అనే రేవంత్ రెడ్డి సర్కారు తీరు సొమ్మొకరిది.. సోకరిది అన్న తీరుగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందాల తారలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాల కోసం పదవుల పేరుతో ఒత్తిళ్లు, ప్రలోభాలు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు, రేవంత్‌రెడ్డి భాగోతం నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసిన చార్జ్‌షీట్‌తో బయట పడిందన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాక ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు రేవంత్ వందల కోట్ల రూపాయలు కట్టబెట్టిన వ్యవహారం కుండ బద్దలైందని తెలిపారు.
30 శాతం కమీషన్ ఇవ్వందే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి పిల్లను ఇచ్చిన మామ సూదిని పద్మారెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగలేదని స్వయంగా చెప్పడం రేవంత్‌కు చెంపపెట్టు అన్నారు. కేసీఆర్‌ను రేవంత్ సర్కారు ఎందుకు వేధిస్తున్నదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినందుకా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు సాగునీరు అందించినందుకా? రైతు బంధు, రైతు బీమా, నిరంత ఉచిత విద్యుత్‌తో రైతును రాజు చేసినందుకా? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు ఇచ్చినందుకా? ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు 40 శాతం కూడా జరుగలేదని, కేంద్రాల వద్ద కుప్పలు వానకు తడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులకు రైతుల కష్టాలు పట్టించుకోవడానికి క్షణం తీరిక లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, యానాల అశోక్ రెడ్డి, కొండూరు శంకర్, తరాల బలరాం, జ్యోతీ బలరాం, కోటి రెడ్డి, సుధీర్, సతీశ్, దుబ్బ మదు, సత్తిరెడ్డి, ప్రకాశ్, సాయి పాల్గొన్నారు.