హాలియా, జనవరి 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన సాగిస్తున్నదని, ఏడాది కాలంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 హామీలు ఇచ్చిందని, కానీ ఏడాది పూర్తయినా 420 కాదు కదా 6 గ్యారెంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గతేడాది డిసెంబర్ 9న రైతు భరోసా ఎకరానికి 15వేల రూపాయల ఇస్తామని చెప్పి, ఏడాది కాలం గడిపి ఇప్పుడు 12 వేలు ఇస్తామని చెప్పడం మోసం చేయడమే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని, ఆసరా పింఛన్ల పెంపు లేదని, కల్యాణలక్ష్మిపాటు తులం బంగారం ఇవ్వడం లేదని తెలిపారు. రైతు భరోసా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ మోసం మరోసారి రుజువైందని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.